April 22, 2026
Explore
జలధార జలహారతితో కంచాలమ్మ గండి చెరువుకు పునర్జీవనం కల్పించాలి

జలధార జలహారతితో కంచాలమ్మ గండి చెరువుకు పునర్జీవనం కల్పించాలి

April 22, 2026 | Andhra Pradesh

మాండవ్య నది అభివృద్ధికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం

సమగ్ర ప్రణాళికలు రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలి

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

రాయచోటి ముచ్చట్లు:

జిల్లాలో జలవనరుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జలధార జల హారతి” కార్యక్రమానికి భాగంగా రాయచోటి మండలం ఎగువ అబ్బవరం వద్ద ఉన్న కంచాలమ్మ గండి చెరువును బుధవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖామాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇరిగేషన్, డ్వామా అధికారులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ మాండవ్య నది నుంచి చెరువుకు వచ్చే నీటి ప్రవాహ మార్గాన్ని పరిశీలించి, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మాండవ్య నదిని పూర్తిగా శుభ్రపరిచి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. నదిలో అవసరమైన ప్రదేశాల్లో కొత్త చెక్ డ్యాములు నిర్మించడం, ఇప్పటికే దెబ్బతిన్న చెక్ డ్యాములను మరమ్మతు చేయడం ద్వారా నీటి నిల్వ పెంపుతో పాటు భూగర్భ జలాల స్థాయిని గణనీయంగా పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు.

కంచాలమ్మ గండి చెరువుకు నీరు చేరే సప్లై ఛానల్‌ను సరిచేసి, ఎక్కడైనా అడ్డంకులు ఉన్నా తొలగించి, నీటి ప్రవాహం నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్‌ను కోరారు. చెరువు పునరుద్ధరణతో పరిసర ప్రాంతాల్లో వ్యవసాయానికి ఊతం లభించడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అదేవిధంగా మాండవ్య నదిని కేవలం నీటి వనరుగా మాత్రమే కాకుండా, అందంగా తీర్చిదిద్దేలా బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. గాలివీడు రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ట్యాంకును కూడా కలెక్టర్ తో కలిసి మంత్రి పరిశీలించి, నీటి ప్రవాహ పరిస్థితులను అంచనా వేసి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

మంత్రిగారి సూచనల మేరకు చేపట్టాల్సిన అన్ని పనులపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి, తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ అంశాలలో వేగవంతమైన చర్యలు తీసుకొని, జలధార కార్యక్రమాన్ని ఫలితాల ఆధారితంగా విజయవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

జలధార కార్యక్రమం జిల్లాలో పటిష్టంగా అమలు చేసి విజయవంతం కావడంలో కృషిచేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు రిటైర్డ్ ఇరిగేషన్ అధికారి వెంకట్రామయ్యను మంత్రి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, డ్వామా మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Tags;Kanchalamma Gandi Cheruvu must be revitalized through the ‘Jaladhara’ and ‘Jalaharati’ rituals.