మన వాస్తవ చరిత్ర తెలుసుకుందాం
అమరావతిముచ్చట్లు:
భారతదేశం హిందూ దేశం… ఇది మన పవిత్ర భూమి… మన పూర్వీకులు ఇక్కడే ఉద్భవించారని కొందరు అంటూ ఉంటారు. కానీ జన్యు శాస్త్రం, పురాతత్వ శాస్త్రం, ఆధునిక DNA పరిశోధనలు ఏమంటున్నాయి అంటే.. భారత భూభాగంలో ఒకప్పుడు ఆధునిక మానవులు (Homo sapiens) లేరు. మనందరం ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన వలసదారుల వారసులమే. ఇక “నా దేశం, నా మతం, నా ప్రాంతం” అనే ఆలోచనలకు ఆధారం లేదు.
ఆఫ్రికా నుంచి ప్రారంభం
హోమో సేపియన్స్ (ఆధునిక మానవులు) సుమారు 3,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలో ఆవిర్భవించారు. ఇది జీవ శాస్త్రవేత్తలు, జన్యు శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయంగా అంగీకరించిన వాస్తవం. ఆఫ్రికాలోని జెబెల్ ఇర్హౌడ్ , ఒమో కిబిష్ (ఎథియోపియా) వంటి సైట్లలో దొరికిన అస్థి పంజరాలు, DNA ఆధారాలు ఇదే చెబుతున్నాయి.
సుమారు 50,000 నుంచి 70,000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రధాన (ఆఫ్రికా నుంచి బయటకు) వలస మన గత చరిత్రను మార్చేసింది. ఒక చిన్న సమూహం ఆఫ్రికా నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దాటి, అరేబియా ద్వీపకల్పం గుండా, ఇరాన్ తీరప్రాంతం వెంబడి దక్షిణాసియా వైపు ప్రయాణించింది. ఇది “సదర్న్ రూట్” అని పిలువబడుతుంది. 2025లో సెల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం స్పష్టంగా చెప్పింది. భారతీయులలో ఉన్న చాలా జన్యు వైవిధ్యం ఆఫ్రికా నుంచి 50,000 సంవత్సరాల క్రితం జరిగిన చిన్న చిన్న వలసల నుంచి వచ్చిందవి.
భారత ఉపఖండంలో ఈ వలసదారులు సుమారు 65,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం చేరుకున్నారు. గుజరాత్ తీరం, ఆంధ్రప్రదేశ్‌లోని జ్వాలాపురం వంటి ప్రాంతాల్లో దొరికిన రాళ్ల పనిముట్లు, DNA ఆధారాలు ఇదే చెబుతున్నాయి.
అంతకు ముందు భారత భూమి ఖాళీగా ఉండేది కాదు కానీ, ఆధునిక మానవులు లేరు. ఇక్కడ హోమో ఎరెక్టస్ వంటి ప్రాచీన మానవ జాతులు 15 లక్షల సంవత్సరాల క్రితం ఉండవచ్చు వారు మన పూర్వీకులు కాదు. మనం ఆఫ్రికా నుంచి వచ్చిన సేపియన్స్‌లం. తర్వాత వందల సంవత్సరాల్లో ఇరాన్ నుంచి వ్యవసాయవాదులు మధ్య ఆసియా స్టెప్ ప్రాంతం నుంచి పశుపాలకులు వలస వచ్చారు. హరప్పా నాగరికత ఈ మిశ్రమం నుంచే ఏర్పడింది.
జన్యు శాస్త్రం ఏమంటుంది
భారతీయులందరూ మూడు ప్రధాన ప్రాచీన సమూహాల మిశ్రమం అని జెన్యు శాస్త్రం చెబుతుంది.
- దక్షిణ ఆసియా హంటర్-గాదరర్లు (AASI – ఆ 50,000 సంవత్సరాల వలస నుంచి).
- ఇరాన్ సంబంధిత వ్యవసాయవాదులు.
- యూరేషియన్ స్టెప్ పాస్టరలిస్టులు.
ఇప్పుడు ఆలోచించండి: భారతదేశం హిందూ దేశమని, ఇక్కడి సంస్కృతి మొదటి నుంచీ మనదే అని చెప్పేవారు… ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వారి వారసులమని తెలుసుకోవాలి. ప్రపంచంలో ఆఫ్రికా తప్ప మిగతా అన్ని ఖండాల్లోనూ మానవులు వలస వచ్చినవారే.
జీవపరిణామ క్రమం ప్రకారం మనిషి జంతువుల నుంచి ఎదిగాడు, సైన్సు ద్వారా ఎదిగాడు. మతాలు, సంప్రదాయాలు తర్వాత వచ్చాయి. రాఖిగర్హి DNA, హరప్పా అవశేషాలు, ఆధునిక జన్యు అధ్యయనాలు (2024-2025) అన్నీ ఒకటే సత్యం చెబుతున్నాయి. మనమంతా ఒకే కుటుంబం, ఒకే వలసదారుల వారసులమని. ఈ సత్యం మన అహంకారపు పొరలను తొలగించాలి. భారతదేశం గొప్పది కావాలంటే మన సంస్కృతుల మిశ్రమం, వైవిధ్యం, సహజీవనం మీద ఆధారపడాలి. “నా మతం ఉన్నతం” అనే పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి హేతుబద్ధంగా ఆలోచించాల్సి ఉంది. జ్ఞానం ఒక్కటే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది.
Tags:The Land of India… Whose Country Is It?