April 22, 2026
Explore
అందరు IAS లకు ఒక న్యాయం

అందరు IAS లకు ఒక న్యాయం

April 22, 2026 | Andhra Pradesh

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కి మరో న్యాయమా..!

ఆస్తుల వివరాల రహస్యం ఎందుకు..?

అమరావతిముచ్చట్లు:

దేశంలో ప్రతి ఐఏఎస్ అధికారి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం జనవరి 31 లోపు తన స్థిరాస్తుల వివరాలు అంటే Immovable Property Return (IPR) ఫైల్ చేయాలి. ఇది All India Services (Conduct) Rules, 1968 లోని రూల్ 16(2) స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5,577 మంది ఐఏఎస్‌లు విధుల్లో ఉన్నారు. వీరందరి IPR లను Department of Personnel & Training (DoPT) వెబ్‌సైట్‌లో “View Immovable Property Returns filed by IAS Officers” అనే పబ్లిక్ సెక్షన్‌లో ఎవరైనా చూడవచ్చు. ఈ నిబంధనన్ని అందరూ ఐఏఎస్లు అమలు చేస్తున్నారు, ఒక్కరు తప్ప. ఆయనే భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ (1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి) జ్ఞానేష్ కుమార్.

2015 నుండి 2025 వరకు పదేళ్ల కాలానికి ఆయన ఫైల్ చేసిన IPR కాపీలు DoPT వెబ్‌సైట్‌లో పబ్లిక్ డొమైన్‌లో లేవు. ఈ అంశాన్ని రాజ్యసభ సభ్యులు (తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ) సాకేత్ గోఖలే గుర్తించి 30.11.2025 న RTI ద్వారా DoPT ని ప్రశ్నించారు. 2015-2025 మధ్య IPR కాపీలు, లేకపోతే కనీసం ఆస్తుల కొనుగోలు, అమ్మకాల వివరాలైనా ఇవ్వాలని కోరారు. అంతేకాదు RTI చట్టం సెక్షన్ 8(2) ప్రకారం ప్రజా ప్రయోజనం ఉంటే వ్యక్తిగత సమాచారం కూడా వెల్లడించవచ్చని గుర్తు చేశారు.

అయితే DoPT ఇచ్చిన సమాధానం విస్మయం కలిగిస్తోంది. అడిగిన సమాచారం వ్యక్తిగత సమాచారం. RTI Act సెక్షన్ 8(1)(j) కింద మినహాయింపు ఉంది. కాబట్టి ఇవ్వలేం అని తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల కమీషన్ అధిపతి ఆస్తుల వివరాలు ‘పర్సనల్’ అని చెప్పి దాచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇక్కడే అసలు ప్రశ్న

దేశంలోని 5,577 మంది ఐఏఎస్‌లు రూల్స్ ఫాలో అయి IPR లు పబ్లిక్‌గా పెడుతుంటే, ఒక్క సీఈసీ మాత్రం అతీతుడా? ఆయనకూ భారత ప్రభుత్వమే జీతం ఇస్తోంది కదా. ఆయనా ఐఏఎస్ నిబంధనలకు లోబడే ఉంటారు కదా. మరి ఆయన విషయంలోనే కేంద్ర ప్రభుత్వం(బీజేపీ) రక్షణ కవచంలా ఎందుకు నిలబడుతోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉన్నత పదవుల్లో ఉన్నవారు నిజాయితీగా ఉండటమే కాదు, నిజాయితీగా కనిపించాలి కూడా. ఎన్నికల కమీషనర్ లాంటి పదవికి ఇది మరింత వర్తిస్తుంది. ఎందుకంటే ప్రజల నమ్మకమే ఆ వ్యవస్థకు బలం.
RTI చట్టం ఉద్దేశం పారదర్శకత. కానీ ఆ చట్టంలోని మినహాయింపు క్లాజులను అడ్డుపెట్టుకుని, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఆస్తుల వివరాలు దాచిపెడితే ఆ చట్టం వైఫల్యమే అవుతుంది. ‘వ్యక్తిగత గోప్యత’ అనే పదం ప్రజా ప్రయోజనాన్ని మించిపోకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, జవాబుదారీతనం రెండూ కీలకం. 5,577 మంది ఐఏఎస్‌లకు వర్తించే రూల్ ఒక్కరికి వర్తించకపోతే అది ‘సమానత్వం’ అనిపించుకోదు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం, ఈ దేశం ఎటు పోతుంది..?

Tags:One standard of justice for all IAS officers.