March 13, 2026
Explore
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలి

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలి

March 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • మార్చి 16 నుండి భక్తులకు అన్నప్రసాదం వితరణ ప్రారంభం

– టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్చి 16 నుండి నిత్య అన్నప్రసాదం వితరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీటీడీలోని అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
అలాగే ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నిత్య అన్నప్రసాద భవనాన్ని మార్చి 16న ప్రారంభించనున్నట్లు తెలిపారు.

అనంతరం ఆయన అధికారులతో కలిసి ఆలయ నాలుగు మాడ వీధులు, నిత్య అన్నప్రసాద భవనం, శ్రీ సీతారాముల కల్యాణ వేదికలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

తదుపరి టీటీడీ మరియు జిల్లా అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ టి.వి.సత్యనారాయణ, ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు శివప్రసాద్, సెల్వం, డీఈ (ఎలక్ట్రికల్) రవి శంకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags: Works for the Sri Kodandarama Swamy Brahmotsavams at Ontimitta must be completed expeditiously.