తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి 8.30 గంటల వరకు జరుగనుంది.
ఈ ఆలయంలో మార్చి 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారు, అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
అనంతరం సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించబడుతుంది.
తదుపరి రాత్రి 7.00 గంటలకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తారు.
ఈ పుష్పయాగంలో గృహస్తులు (ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పాల్గొనవచ్చు.
Tags: Ankurarpana for Sri Kodandarama Swamy’s Pushpayagam on the 22nd.