April 19, 2026
Explore
పీలేరులో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ మెరుపు దాడులు

పీలేరులో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ మెరుపు దాడులు

April 19, 2026 | Andhra Pradesh

: 450 ఇళ్లలో సోదాలు.. పకడ్బందీగా తనిఖీలు..

మదనపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా, రాయచోటి సబ్ డివిజన్ లోని పీలేరు పట్టణ పరిధిలోని శ్రీనాధపురం కాలనీ మరియు రాజీవ్ నగర్ కాలనీల్లో ఆదివారం వేకువజామున భారీ ‘మెగా కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు.

ఏపీ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఐజీపీ (ఈగల్ చీఫ్) శ్రీ ఏ.కే. రవి కృష్ణ ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సూచనలతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్ నేతృత్వంలో సుమారు 60 మందికి పైగా పోలీసు అధికారులు, ఈగల్ టీమ్ సభ్యులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై నిఘా పెంచడంలో భాగంగా పోలీసులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద ఇళ్లు, అద్దె భవనాలు మరియు ఖాళీ ప్రదేశాల్లో జరిపిన ఈ సోదాల్లో గణనీయమైన ఫలితాలు కనిపించాయి.

మొత్తం 450 ఇళ్లు, 1200 మంది వ్యక్తులు. 214 వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో సరైన పత్రాలు లేని 64 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 1 ఇన్నోవా కారుపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

శ్రీనాధపురం కాలనీకి చెందిన నీళ్ళ శివ శంకర్ వద్ద నుండి 15 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

కేవలం తనిఖీలతో సరిపెట్టకుండా, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారులు, వారిని సత్ప్రవర్తనతో మెలగాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, కుటుంబాలపై వాటి ప్రభావం గురించి పోలీసులు వివరించారు. ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” చేయించారు.

“డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం. ఈ దిశగా నిరంతరం నిఘా కొనసాగుతుంది” అని రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్ స్పష్టం చేశారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించేవారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు.

అత్యవసర సమాచారం కోసం
EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972
పోలీస్ హెల్ప్‌లైన్ 112 కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.
ఈ ఆపరేషన్‌లో పీలేరు సీఐ యుగంధర్, కలికిరి సీఐ అనిల్ కుమార్, సబ్ డివిజన్ ఎస్ఐలు, ఈగల్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Operation Vajra Prahar’ Lightning Raids in Pileru