April 18, 2026
Explore
“మూగ నోముకు మధుర స్వరం”…

“మూగ నోముకు మధుర స్వరం”…

April 18, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

శ్రవణంతో చిన్నారుల భవిష్యత్తుకు వెలుగులు నింపుతున్న టిటిడి

శ్రవణంను పరిశీలించిన టిటిడి జేఈవో (వైద్యం మరియు విద్య) డా. ఎ. శరత్

టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణం సంస్థను టిటిడి జేఈవో (వైద్యం మరియు విద్య) డా. ఎ. శరత్ శనివారం అధికారులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. చిన్నారుల జీవితాల్లో శ్రవణం ద్వారా వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా తెలుసుకొని, సేవల మరింత మెరుగుదలకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణం, శ్రీ వేంకటేశ్వర బాలమందిరం సంస్థలలో అందిస్తున్న సేవలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని జేఈవో సూచించారు. టిటిడి సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాలు, ఎస్వీబీసీ ఛానల్, టిటిడి సోషల్ మీడియా, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మరియు దివ్యాంగుల శాఖలతో సమన్వయం చేసుకుని ప్రచారాన్ని విస్తరించాలని ఆదేశించారు. 2026–2027 విద్యాసంవత్సర ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సెలవులు ముగిసేలోపు పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు.

పిల్లల తల్లులతో మమేకమై మాట్లాడిన జేఈవో, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఆహారం అందుతున్నదా, శిక్షణ నాణ్యత ఎలా ఉందో, పిల్లలలో వచ్చిన పురోగతి, సౌకర్యాలపై సంతృప్తి స్థాయి వంటి అంశాలను తెలుసుకున్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన తల్లులు శిక్షణపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ, “మూగ నోముతో వచ్చాం… నవ్వు నోముతో వెళ్తున్నాం” అని భావోద్వేగంగా తెలిపారు.

ఈ సందర్భంగా తరగతి గదుల్లో ఆధునిక వసతులు, డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయాలని జేఈవో సూచించారు. డే స్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం, శిక్షణ అనంతరం ఆధునిక వినికిడి పరికరాల పంపిణీ, మెరుగైన బోధనాంశాలు, బోధనా పద్ధతులు, స్టేషనరీ, స్టడీ మెటీరియల్, పాఠ్యాంశాలపై డిఈవో టి. వెంకట సునీల్‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో డిఎఫ్వో డి. ఫణికుమార్ నాయుడు, డిఈవో టి. వెంకట సునీల్, అదనపు ఆరోగ్య అధికారి డా. సునీల్, శ్రవణం ప్రాజెక్ట్ ఏఈవో అమ్ములు, ఈఈ మల్లికార్జున ప్రసాద్, ఇతర అధికారులు, శ్రవణం సిబ్బంది పాల్గొన్నారు.

Tags:A Melodious Voice for a Vow of Silence