కర్నూలు ముచ్చట్లు:
ప్రయాణికుల ఆందోళన కర్నూలు నుండి గద్వాల్‌కు వస్తున్న గద్వాల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. బస్సు నడుపుతూ డ్రైవర్ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రయాణించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రయాణికుల కథనం ప్రకారం, రాత్రి వేళల్లో ఒక చేతితో ఫోన్‌లో మాట్లాడుతూనే మరో చేతితో బస్సును నడిపినట్లు తెలిపారు. ఇది ప్రమాదకరమని ప్రశ్నించిన ప్రయాణికులపై డ్రైవర్ దురుసుగా స్పందించాడని వారు ఆరోపిస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని చెబుతుండగా, ఇలాంటి సంఘటనలు భద్రతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు నడుపుతూ ఫోన్ ఉపయోగించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఇలాంటి ఘటనలపై ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఏ చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Tags: RTC Bus Driver’s Negligence on the Kurnool-Gadwal Route