April 15, 2026
Explore
అంగరంగ వైభవంగా శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు

April 15, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

మే 01 నుండి 09 వరకు బ్రహ్మోత్సవాలు

సమన్వయంతో విజయవంతం చేయాలి : జేఈవో వీరబ్రహ్మం

నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం ఆలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 1న ధ్వజారోహణంతో ప్రారంభమై మే 9న ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాగలాపురం పరిసర గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌, పుష్పాలంకరణలు చేయాలని, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, చలువ పందిళ్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలు ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని, ఆలయ ప్రాశస్త్యం తెలియజేయడానికి ఎస్వీబీసీలో ప్రోమోలు ప్రసారం చేయాలని సూచించారు.

ప్రతి రోజు భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదం కౌంటర్లు పెంచాలని, మొబైల్ మరుగుదొడ్లు, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆదేశించారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించాలని తెలిపారు.

అనంతరం జేఈవో ఆలయం, పోటు, యాగశాల, నాలుగు మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో డెప్యూటీ ఈవోలు నాగరత్న, శ్రీ గోవిందరాజన్, ఎస్.ఈ.-3 నరసింహ మూర్తి, విజీవో శ్రీ గిరిధర్, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవిఎన్ శివకుమార్, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

స్థల పురాణం

నాగలాపురంలోని వేదవల్లీ సమేత వేదనారాయణ స్వామివారి ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.పురాణాల ప్రకారం, ‘సోమకాసురుడు’ అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచగా, శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి అతన్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేశారు. ఆ మహత్తర ఘట్టం జరిగిన పవిత్ర ప్రాంతమే నాగలాపురం.

ఈ క్షేత్రంలో మత్స్యరూపంలో ఉన్న శ్రీహరిని మహాలక్ష్మి, పరమేశ్వరుడు దర్శించినట్లు విశ్వాసం ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని “హరికాంతపురం” అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయం పంచప్రాకారాలు, సప్తద్వారాలతో అద్భుత శిల్పకళతో నిర్మించబడింది. ప్రతి సంవత్సరం సూర్యకిరణాలు మూలవిరాట్‌ను స్పర్శించే విశేషం ఉంది. దీనినే “సూర్యపూజ”గా ఘనంగా నిర్వహిస్తారు.

Tags: Sri Vedanarayana Swamy’s Brahmotsavams Celebrated with Grandeur and Splendor