April 15, 2026
Explore
సోషల్ మీడియాపై ఏపీ పోలీసుల ప్రత్యేక నిఘా..

సోషల్ మీడియాపై ఏపీ పోలీసుల ప్రత్యేక నిఘా..

April 15, 2026 | Andhra Pradesh

భారీగా కేసుల నమోదు

సోషల్ మీడియా దుర్వినియోగంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర హెచ్చరిక

రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై 1,549 కేసులు, 1,344 మంది అరెస్ట్

పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు

పదేపదే తప్పు చేస్తే వ్యవస్థీకృత నేరాల కింద చర్యలు తప్పవని స్పష్టీకరణ

అమరావతిముచ్చట్లు:

సామాజిక మాధ్యమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్రంగా హెచ్చరించారు. అసభ్యకరమైన, రాజకీయ ప్రేరేపిత, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిని, వదంతులు వ్యాప్తి చేసేవారిని ఉపేక్షించేది లేదని ఓ పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై ఇప్పటివరకు 1,549 కేసులు నమోదు చేసి 1,344 మందిని అరెస్టు చేశామని తెలిపారు. చట్టవిరుద్ధమైన 4,529 కంటెంట్‌లను తొలగించామని చెప్పారు. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ‘సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్’ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై ఈ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని డీజీపీ పేర్కొన్నారు. పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు, సంఘటిత బృందాలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని ఆయన తేల్చిచెప్పారు.

Tags:AP Police Maintain Special Surveillance on Social Media