విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ కలెక్టరేట్‌లో ఉద్యోగులపై ఓ వృద్ధురాలు కారం చల్లిన ఘటన సోమవారం తీవ్ర కలకలం రేపింది. ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అధికారులపై సదరు మహిళ కారం చల్లటంతో అక్కడి వారందరూ షాక్ తిన్నారు. నందిగామ మండలంలోని అనాసాగరానికి చెందిన లక్ష్మీతులసి అనే వృద్ధురాలు తనకు రావాల్సిన పరిహారం కోసం విజయవాడ కలెక్టరేట్‌కు వెళ్లారు. అయితే అధికారులు తనను పట్టించుకోలేదనే కోపంతో భూసేకరణ విభాగంలోని ఉద్యోగులపై కారం చల్లారు. దీంతో ఉద్యోగులతో పాటుగా అక్కడున్న వారంతా షాక్ తిన్నారు.
విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం ఊహించని ఘటన చోటుచేసుకుంది. పరిహారం ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారనే కోపంతో ఓ వృద్ధురాలు కలెక్టరేట్‌లోని అధికారులపై కారం చల్లింది. దీనికి సంబంధించిన బాధితురాలు చెప్తున్న వివరాల ప్రకారం.. నందిగామ మండలంలోని అనసాగరం గ్రామానికి చెందిన లక్ష్మీ తులసి అనే వృద్ధురాలికి చెందిన భూమిని.. 2010లో జాతీయ రహదారి కోసం ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకుంది. 2 సెంట్ల 20 గజాల భూమిని రోడ్డు విస్తరణ పనుల కోసం సేకరించారు. దీనికి సంబంధించిన రూ.24 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం లక్ష్మీతులసికి చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ తనకు పరిహారం డబ్బులు రాలేదని బాధితురాలు వాపోతున్నారు.
పరిహారం చెల్లించాలని కలెక్టరేట్‌లో చాలాసార్లు వినతి పత్రాలు సమర్పించానని.. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని లక్ష్మీతులసి చెప్తున్నారు. పరిహారం డబ్బులు ఇవ్వకుండా తనను తిప్పించుకుంటున్నారనే కోపంతో.. సోమవారం రోజున విజయవాడ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులపై కారం చల్లారు లక్ష్మీతులసి. దీంతో అందరూ షాక్ తిన్నారు. అయితే తానేమీ తప్పు చేయలేదంటున్న లక్ష్మీతులసి.. భూమి లేక, పరిహారం రాక ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు.
మరోవైపు లక్ష్మీతులసి అంశంపై భూసేకరణ విభాగం అధికారులు స్పందించారు. లక్ష్మీతులసి భూమి పరిహారం అంశం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు సంబంధించినదని.. తమ పరిధిలోకి రాదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులను సంప్రదించాలని లక్ష్మీతులసికి సూచించారు. అయితే పరిహారం చెల్లించకుండా తనను తిప్పించుకుంటున్నారని లక్ష్మీతులసి వాపోతున్నారు. ఇకనైనా తన డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు.
మరోవైపు జిల్ల కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ కార్యక్రమంలో ఊహించని విధంగా జరిగిన ఈ ఘటన కారణంగా కలెక్టరేట్‌లో కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే విషయం తెలుసుకున్న తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అధికారులు వృద్ధురాలి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు సకాలంలో న్యాయం జరగకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Tags: Elderly Woman Throws Chili Powder at Employees at Vijayawada Collectorate… Here Is the Reason.