అమరావతిముచ్చట్లు:
- తెలంగాణలో సూర్యుడు సుర్రుముంటున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తుండగా.. తీవ్ర వడగాలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం నిజామాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
- తెలంగాణలో భానుడి భగభగలు
- పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
- వాతవరణశాఖ హెచ్చరికలు జారీ
- తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. చాలా జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. వడగాలుల ప్రభావంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న వారం రోజులు హీట్ వేవ్స్ ప్రమాదం పొంచి ఉందని.. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్యయ్యే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
- తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం నిజామాబాద్‌లో 43.2 డిగ్రీ సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత నల్గొండలో 43.1, కామారెడ్డి 42.9, ఆదిలాబాద్ 42.8, జగిత్యాల 42.8, గద్వాల్ 42.8, ములుగు 42.8, నిర్మల్ 42.8, ఆసిఫాబాద్ 42.7, మెదక్ 42.7, నాగర్ కర్నూల్ 42.7, సిద్దిపేట 42.7, సిరిసిల్ల 42.5, సూర్యాపేట 42.5, భద్రాద్రి – కొత్తగూడెం 42.5, కరీంనగర్ 42.4, సంగారెడ్డి 42.4, వనపర్తి 42.3, హన్మకొండ 42.2, జనగాం 42.1, ఖమ్మం 42.1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్ నగరంలో తొలిసారిగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటాలు. హిమాయత్‌నగర్‌లో 40.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది.
👉వడదెబ్బతో నలుగురు మృతి
- ఇక తీవ్ర ఎండలు, వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హనుమకొండ జిల్లా దర్గా కాజీపేటకు చెందిన ఎండీ అఫ్జల్ (28), వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లె గ్రామానికి చెందిన గాదం వినయ్‌కుమార్ (38), కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరుకు చెందిన గెరిగెంటి మారుతి(70), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధి కరకవాగుకు చెందిన వై.చంద్రశేఖర్(30) వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచారు.
👉ఈ జాగ్రత్తలు తీసుకోండి
- వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదు.
- ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేదా గొడుగు ధరలించాలు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరిస్తే మేలు.
- దాహం వేయకపోయినా తరుచూ నీరు తాగాలి. శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా నిమ్మరసం, మజ్జిగ, రాగి జావ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
- ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటం మేలు. టీలు, కాఫీలు వంటివి తగ్గించాలి. నూనెలో వేయించిన పదార్థాలు, ఫ్రై ఐటమ్స్‌కు కూడా దూరంగా ఉండాలి.
- వడదెబ్బ తగలకుండా చల్లని ప్రదేశాల్లో ఉండటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా గర్భిణిలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Tags;The Sun Blazes Fiercely… Four Dead Due to Heatstroke; Take These Precautions.