ఆళ్లగడ్డ మండలంలో దారుణం – ఆస్తి వివాదం రక్తపాతం – ఇద్దరు అన్నదమ్ములకు గాయాలు
నంద్యాల ముచ్చట్లు:
ఆళ్లగడ్డ మండలంలోని ఆర్.కృష్ణాపురంలో ఆస్తి వివాదం ఘోర హత్యకు దారితీసింది. ఎస్సీ కాలనీకి చెందిన ఏసేబుకు ఐదుగురు కుమారులు ఉండగా, వారిలో ఆస్తి పంచుకునే విషయంలో కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కుటుంబంలో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల తగాదా ఘర్షణగా మారి, తమ్ముడు విజయరాజు ఆవేశంతో రోకలిబండతో అన్న దైవ భక్తుడు (40)పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దైవ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు విజయరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Bloodshed over Property: Younger Brother Kills Elder Brother