April 11, 2026
Explore
విద్యా జ్యోతి వెలిగించిన మహాత్మా జ్యోతిబా పూలే

విద్యా జ్యోతి వెలిగించిన మహాత్మా జ్యోతిబా పూలే

April 11, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి

మహిళల గౌరవానికి బాల్యం నుంచే విలువల బోధన అవసరం : జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీమతి జి.అర్చన

ఘనంగా 199వ జయంతి వేడుకలు నిర్వహించిన టిటిడి

మానవ సమాజాన్ని సంస్కరణల వైపు నడిపించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శనివారం టిటిడి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ పురోగతికి సామాజిక సంస్కరణలు అవసరమని గ్రహించిన జ్యోతిబా పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్య, జ్ఞానం, ఆత్మవిశ్వాసం, స్వయం నియంత్రణ వంటి విలువలను పెంపొందించే దిశగా కృషి చేశారని తెలిపారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి విద్యనే ప్రధాన మార్గంగా భావించి, తన సతీమణి నుంచే విద్యా ప్రబోధాన్ని ప్రారంభించారని వివరించారు. ప్రతి కుటుంబంలో విద్యాభివృద్ధి ఉంటే వైరుధ్యాలు తగ్గుతాయని ఆయన చైతన్యం కల్పించారన్నారు. “గులాం గిరి” వంటి రచనల ద్వారా సామాజిక స్వేచ్ఛకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు. మహిళల్లో విద్యా చైతన్యం పెంపొందించడంలో ఆయన కృషి విశేషమని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన అదనపు జిల్లా జడ్జి జి. అర్చన మాట్లాడుతూ, విద్యా జ్యోతి వెలిగించిన మహనీయుడు జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు. నేటి పరిస్థితుల్లో మహిళల పట్ల గౌరవ భావం పెంపొందించడానికి బాల్యం నుంచే సరైన విలువలను బోధించాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఏపీ సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు కె.వి. కృష్ణయ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వివక్షను తొలగించడానికి విద్యే ప్రధాన మార్గమని, ప్రతి కుటుంబంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

అంతకు ముందు మహతి కళాక్షేత్రంలో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. టిటిడి ఉద్యోగులు జ్యోతిబా పూలే జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా 60 మంది ఉద్యోగులను మహాత్మా జ్యోతిబా పూలే అవార్డులతో సత్కరించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా, క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో (సంక్షేమం) ఏ. ఆనందరాజు, డా. ఎన్. భీమన్న, మెడికల్ ఆఫీసర్ కుసుమ కుమారి తదితరులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Mahatma Jyotiba Phule: The One Who Lit the Lamp of Education