రాయచోటి నియోజకవర్గంలో తొలి దశలో 2,784 ఎస్సీ ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు మంజూరు
ఒక్కో యూనిట్‌కు రూ.1.20 లక్షల వ్యయంతో.. తొలి దశలో రూ.33.40 కోట్ల వ్యయం
➤ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖామాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
సూర్య ఘర్ పథకం ద్వారా… పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధి
➤ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
చిన్నమండెం ముచ్చట్లు:
ఎస్సీ, ఎస్టీ పేదల ఇళ్లను సౌర వెలుగులతో నింపి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతతో కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖామాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
శనివారం రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లె గ్రామంలోని బాపూజీ నగర్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలకు పీఎం సూర్యఘర్ పథకం కింద అమర్చిన 2 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖామాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా 36 మంది లబ్ధిదారుల గృహాలపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… రాయచోటి డివిజన్ లోని ఆరు మండలాల్లో తొలి దశలో 2,784 మంది. ఇప్పటికే వంద ఇళ్లపై వీటి ఏర్పాటు పూర్తయింది. చిన్నమండెం మండలంలో 68 పూర్తయ్యాయి. దేవగుడిపల్లె గ్రామం బాపూజీనగర్ కాల నీలో 36 కుటుంబాల ఇళ్లపై అన్ని పనులు పూర్తిచేశారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తోంది.గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ స్వావలంబన సాధనలో ఈ పథకం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రతి గృహానికి 2 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబాలకు నెలవారీ విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.
రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 8,256 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉండగా, తొలి దశలో 2,784 ఎస్సీ ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు మంజూరు చేయబడ్డాయని, మొత్తం 5.568 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఏర్పడనుందని మంత్రి వివరించారు. ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.1.20 లక్షల వ్యయంతో, తొలి దశలో రూ.33.40 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలు అవుతోందన్నారు.
చిన్నమండెం మండలంలో 968 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులలో 473 గృహాలకు సోలార్ యూనిట్లు మంజూరు చేయగా, అందులో 75 యూనిట్లు ఇప్పటికే పూర్తి చేయబడ్డాయని తెలిపారు. బాపూజీనగర్ కాలనీలో మొత్తం 83 మంది వినియోగదారులలో 36 గృహాలకు సోలార్ యూనిట్లు పూర్తిచేసి, 72 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యం ఏర్పాటు చేయబడిందని, దీనికి రూ.43.20 లక్షల వ్యయం జరిగినట్లు వెల్లడించారు. సూర్య ఘర్ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా తమ ఇండ్లపై సోలార్ రూఫ్ టాప్ అమర్చుకొని విద్యుత్తును ఆదా చేసుకోవడంతో పాటు, మిగులు విద్యుత్తును గ్రిడ్ కు అమ్మడం ద్వారా ఆర్థిక లబ్ది కూడా పొందవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ… పీఎం సూర్యఘర్ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో ఆర్థిక భారం తగ్గిస్తూ, శాశ్వత విద్యుత్ పరిష్కారాన్ని అందిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని, అధికార యంత్రాంగం సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని విస్తరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags: The Alliance Government is striving to fill SC and ST households with solar light.