450 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్
టాటా ఏపిఏ వాహనం స్వాధీనం.
నిజామాబాద్ ముచ్చట్లు:
పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు కొరడా ఝుళిపించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు బోధన్ పరిధిలో భారీ తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ ఏసీపీ (ఇన్‌చార్జ్) మస్తాన్ వాలి పర్యవేక్షణలో పోలీసులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగిడేపల్లి వద్ద గల ‘శ్రీ రాఘవేంద్ర బిన్నీ రైస్ మిల్లు’పై మెరుపు దాడి చేశారు.
ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 450 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అలాగే బియ్యం రవాణాకు సిద్ధంగా ఉన్న టాటా ఏప్ (TS16T 0397) వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన బియ్యాన్ని, వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం బోధన్ రూరల్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
Tags: CCS Conducts ‘Lightning’ Raid on Rice Mill