April 9, 2026
Explore
పాత కక్షలతో న్యాయవాది దారుణ హత్య: ఐదుగురు నిందితుల అరెస్ట్.

పాత కక్షలతో న్యాయవాది దారుణ హత్య: ఐదుగురు నిందితుల అరెస్ట్.

April 9, 2026 | Andhra Pradesh

👉పథకం ప్రకారం ఇంటిపై దాడి చేసి రాళ్లతో మోది హత్య.

👉పరారీలో మరో నిందితుడు.. ట్రాక్టర్లు, బైకులు స్వాధీనం.

💠రాయచోటిలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

రాయచోటి ముచ్చట్లు:

గ్రామంలో ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం ఓ న్యాయవాదిని అతి దారుణంగా హత్య చేసిన ఉదంతంలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు. గురువారం రాయచోటిలోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు.

హత్యకు దారితీసిన కారణాలు:
కేవీ పల్లి మండలం పాత వడ్డేపల్లి గ్రామం కు చెందిన లాయర్ పూజారి యల్లయ్యకు, అదే గ్రామానికి చెందిన నిందితులకు మధ్య గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. యల్లయ్య తన హోదాను అడ్డుపెట్టుకుని తమను తక్కువ చేసి చూస్తున్నాడని, పాత కేసుల ప్రస్తావన తెస్తూ గ్రామస్థుల ముందు అవమానిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన యల్లయ్య ఇంటి ముందు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు విషయంలో జరిగిన ఘర్షణ హత్యకు తక్షణ కారణమైంది.

ముందస్తు పథకం ప్రకారం దాడి:
హత్య చేయాలనే ఉద్దేశంతో నిందితులంతా కడప-పీలేరు రహదారిలోని మఠంపల్లి క్రాస్ వద్ద సమావేశమై స్కెచ్ వేశారు. పథకం ప్రకారం యల్లయ్య ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి దిగ్బంధనం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటిపై దాడి చేసి, అడ్డువచ్చిన యల్లయ్య తల్లిదండ్రులను బయటకు లాగి కొట్టారు. అనంతరం యల్లయ్యను పట్టుకుని, కదలకుండా చేతులు కాళ్లు నొక్కిపెట్టి పెద్ద బండరాళ్లతో తలపై బలంగా మోది ప్రాణాలు తీశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యల్లయ్య తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతిలో చికిత్స పొందుతున్నారు.

అరెస్ట్ వివరాలు – స్వాధీనం చేసుకున్న సొత్తు: ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షణలో, కలకడ సీఐ లక్ష్మన్న బృందం గురువారం (ఏప్రిల్ 9) ఉదయం గడి క్రాస్ బస్ స్టాప్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన వారు:

  1. కుంచెపు శ్రీనివాసులు (39)
  2. కుంచెపు మోహన్ బాబు (27)
  3. కుంచెపు పురుషోత్తం (28)
  4. పూజారి శంకరయ్య (26)
  5. బండి శివ (35)
    (మరో నిందితుడు కుంచెపు నాగేశ్వర్ పరారీలో ఉన్నాడు)

నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన రెండు బండరాళ్లు, 5 కట్టెలు, రెండు మోటార్ సైకిళ్లు మరియు రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు బృందానికి అభినందనలు:
కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్న రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, కలకడ సీఐ లక్ష్మన్న, కేవీ పల్లి ఎస్ఐ శివకుమార్, కలకడ ఎస్ఐ రామాంజనేయులు మరియు సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.జిల్లాలో వ్యక్తిగత కక్షలతో దాడులకు పాల్పడే వారికి స్థానం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Tags: Lawyer Brutally Murdered Over Old Enmities: Five Accused Arrested.