కోటకాడపల్లె సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం కోటకాడపల్లె గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో ఏయే శాఖల కార్యదర్శిలు ఉన్నారు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, వినతులు–ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ సమయానికి విధులకు హాజరై ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఈ విధానం ఖచ్చితంగా అమలు చేస్తే సేవలలో పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతాయన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కరించి, సచివాలయ సేవలు సులభంగా, వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థుల సమస్యలపై ప్రతి సిబ్బంది బాధ్యతతో స్పందించాలని తెలిపారు. భూ రికార్డులు, ల్యాండ్ రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, వాటిని సక్రమంగా నవీకరించాలని అధికారులకు సూచించారు. భూ వివరాలు స్పష్టంగా ఉంటే వివాదాలు తగ్గి ప్రజలకు సేవలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు.
సచివాలయంలోని అన్ని శాఖల వివరాలను డిజిటల్ విధానంలో నవీకరించడంతో పాటు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన పెంచి అర్హులందరికీ లబ్ధి చేకూరేలా కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దారు, ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Priority on Speed and Transparency in Secretariat Services