నేరగాళ్ల గుండెల్లో వణుకు.. సామాన్యుడికి భరోసా.. జిల్లా ఎస్పీ సరికొత్త వ్యూహం.
మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు పోలీసు యంత్రాంగం సరికొత్త ‘అస్త్రం’ పట్టింది. నేరగాడు ఏ పొదలో దాక్కున్నా, ఏ గల్లీలో నక్కినా కనిపెట్టేలా, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో ‘డ్రోన్ ఆపరేషన్’ మొదలైంది. ఇకపై నేరం చేసి తప్పించుకోవడం అసాధ్యమన్నట్లుగా, ఆకాశం నుంచి డేగ కన్నుతో జిల్లా పోలీసులు పహారా కాస్తున్నారు.
జాతరైనా.. బడివద్దైనా..అంతా రికార్డ్! సాధారణంగా రద్దీగా ఉండే జాతరలు, తిరునాళ్లలో దొంగతనాలు, ఆకతాయిల అల్లర్లు ఎక్కువగా జరుగుతుంటాయి. జిల్లాలో జరుగుతున్న ఉత్సవాల్లో జనసమూహాన్ని పర్యవేక్షించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అటు పాఠశాలల వద్ద విద్యార్థుల భద్రతను పర్యవేక్షించడం, ఇటు నిర్మానుష్య ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు జరగకుండా చూడటంలో ఈ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కెమెరా కంటికి చిక్కకుండా ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అడుగు బయటపెడితే ‘డ్రోన్’ నిఘానే! జిల్లాలోని ప్రతి అంగుళాన్ని గాలిలో తేలియాడే కెమెరాలతో జల్లెడ పడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని పొదలు, వాగుల వెంబడి డ్రోన్ కెమెరాల నిఘా కొనసాగుతుంది. ఎస్పీ పర్యవేక్షణలో శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటర్లు నిరంతరం దృశ్యాలను విశ్లేషిస్తూ, క్షేత్రస్థాయిలోని అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.
సాంకేతికతతో రక్షణ కవచం:”ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. సాంకేతికతను జోడించడం వల్ల నేరాల నియంత్రణ సులభతరం అవుతుంది. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే స్తానిక పోలీస్ స్టేషన్ కు లేదా 100/112 కు సమాచారం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
పోలీసుల ఈ ‘హైటెక్’ గస్తీతో నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా, సామాన్య ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం నుంచి పహారా కాస్తున్న పోలీసుల తీరుపై జిల్లావ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Tags: Khaki Surveillance from the Skies: Annamayya District Under the Drone’s Fine-toothed Comb!