April 6, 2026
Explore
యువతకు అవగాహన సదస్సు

యువతకు అవగాహన సదస్సు

April 6, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • డ్రగ్స్ మరియు గంజాయికి వ్యతిరేకంగా జిల్లా పోలీస్ శాఖ, ఈగల్ టీం, మరియు వైబ్రెంట్స్ ఆఫ్ కలాం వారి సమన్వయంతో యువతకు అవగాహన సదస్సు
  • “సైకిల్ యాత్ర – Dandi March 2.0” డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ లో భాగంగా సైకిల్ యాత్ర ప్రారంభం.
  • యువత భవిష్యత్తుపై దృష్టి యువతలో డ్రగ్స్‌పై అవగాహన – కార్యక్రమం.
  • ప్రజల సహకారంతోనే సమాజాన్ని డ్రగ్స్ బారినుంచి రక్షించగలం – యువతే దేశ భవిష్యత్తు.
  • చట్ట విరుద్ధంగా డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు.
  • డ్రగ్స్ వద్దు బ్రో అంటూ పిలుపునిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్., జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు
  • తిరుపతి జిల్లా పోలీస్ శాఖ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం మరియు డ్రగ్-ఫ్రీ సమాజ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిర్వహిస్తున్న “సైకిల్ యాత్ర – Dandi March 2.0” కార్యక్రమాన్ని తిరుపతి లోని ఎస్.వి. యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా తిరుపతి నుండి విశాఖపట్నం వరకు చేపట్టదలిసిన సైకిల్ యాత్రను ప్రారంభించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, ఐఏఎస్., గారు మరియు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జెసి ఆర్ గోవిందరావు ,అడ్మిన్ ఎస్పీ ఈగల్ కె నగేష్ బాబు , పాల్గొన్నారు. అలాగే పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (IGP) ఆకే రవి కృష్ణ, ఐపీఎస్, వర్చువల్‌గా పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు.
  • జిల్లా వ్యాప్తంగా సుమారు 1,15,000 మంది విద్యార్థులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహన పొందారు.
  • ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (IGP) శ్రీ ఆకే రవి కృష్ణ, ., వర్చువల్‌గా మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. విద్యార్థులు, యువత చైతన్యంతో ముందుకు వస్తే సమాజాన్ని డ్రగ్-ఫ్రీగా మార్చడం సాధ్యమవుతుందని అన్నారు.
  • ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, మాట్లాడుతూ మన సమాజం పై మాదక ద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉంటుందనన్నారు. మాదకద్రవ్యాల ప్రభావంతో చాలా దేశాలు చిన్నాభిన్నం అయిపోయాయన్నారు. అటువంటి పరిస్థితి రాకూడదని మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల వినియోగం పై కఠిన చర్యలు చేపడుతున్నాయన్నారు. యువత మత్తుకు బానిసలు కాకూడదని, మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం ద్వారా ఆరోగ్య రీత్యా, చట్టరీత్యా ఎదురయ్యే సమస్యల పై యువతకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. మన రాష్ట్రంలో దండకారణ్యాల పరిధిలో ఉన్న ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా చాలా వరకు గంజాయి సాగు తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వం చాలా కఠినంగా ఉండి ఒక ‘ఈగల్’ (EAGLE) టీమ్‌ను ఏర్పాటు చేసి, సీనియర్ ఐపిఎస్ అధికారుల ఆధ్వర్యం లో చర్యలు చేపట్టిందన్నారు
  • జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మన సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతోనే “సైకిల్ యాత్ర – Dandi March 2.0” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా యువతలో అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులవుతున్నారని, ఇది వారి జీవితాలను మాత్రమే కాకుండా వారి కుటుంబాల భవిష్యత్తును కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • డ్రగ్స్ వినియోగం ఒక పెద్ద సామాజిక సమస్యగా మారుతోందని, ప్రారంభంలో ఇది చిన్న అలవాటుగా కనిపించినప్పటికీ, తరువాత అది పెద్ద నేరాలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన యువత తమ విద్యను కోల్పోయి, ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని, చివరకు చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుని జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటారని స్పష్టం చేశారు.
  • ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ఎవరైనా మాదక ద్రవ్యాల సరఫరా, నిల్వ, వినియోగం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖ ప్రత్యేక బృందాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నదని తెలిపారు.
  • ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి విద్యాసంస్థ, ప్రతి కుటుంబం నుండి ఈ మార్పు ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు, ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి 1972 టోల్ ఫ్రీ నెంబర్ లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
  • ముఖ్యంగా యువత “మీరు దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. మీ ఆరోగ్యం, మీ భవిష్యత్తు కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. డ్రగ్స్ వంటి దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండి, మీ కుటుంబానికి, సమాజానికి గర్వకారణంగా నిలవాలి” అని అన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఇకపై ప్రతి పాఠశాల, కళాశాల, గ్రామ స్థాయిలో మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. యువతలో చైతన్యం పెంపొందించడానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అంతిమంగా, “డ్రగ్-ఫ్రీ సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ లక్ష్యాన్ని సాధించగలం” అని పేర్కొంటూ అందరినీ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
  • ఈగల్ (EAGLE) ఎస్పీ గారు మాట్లాడుతూ, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. యువత తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
  • ఎస్.వి. యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు మంచి విలువలను అలవరచుకోవాలని, డ్రగ్స్ వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థలు కూడా అవగాహన కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని తెలిపారు.
  • సైకిల్ ర్యాలీ ప్రారంభం కార్యక్రమం అనంతరం అధికారులు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు స్వయంగా సైకిల్ తొక్కి యువతకు ప్రేరణగా నిలిచారు.
  • ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన) రవిమనోహర్ఆచారి (శాంతి భద్రతలు )తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్, ఎస్.వి యూనివర్సిటీ విసి నరసింగారావు, శ్రీ పద్మావతి యూనివర్సిటీ విసి వి.ఉమ, ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. భూపతి నాయుడు,కలాం వైబ్రెంట్స్ వ్యవస్థాపకుడు దండి విజయ్ కలాం, సిబ్బంది, విద్యార్థులు, ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags:Awareness Session for Youth