అంతరాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్ట్..
💠మీడియా సమావేశంలో వివరాలు వెడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
👉మదనపల్లి 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్: 106/2025, సెక్షన్లు: 66-C,66-D ITA-2000-2008, 318 (4), 351 (2), 308 (2), బిఎన్ఎస్ యాక్ట్.
మదనపల్లి ముచ్చట్లు:
కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులమంటూ ఫోన్ కాల్స్‌తో బెదిరించి, సామాన్యులను బురిడీ కొట్టిస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును అన్నమయ్య జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి , సోమవారం మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
రూ. 92 లక్షల భారీ మోసం
మదనపల్లి టౌన్ అమ్మినేని వీధికి చెందిన ఆవుల విజయలక్ష్మి (73) అనే వృద్ధురాలిని నిందితులు టార్గెట్ చేశారు. ఆమెకు వీడియో కాల్ చేసిన దుండగులు.. తాము సిబిఐ, ఈడీ అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు. ఆమె పేరు మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయని, విచారణ పేరుతో ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నామని భయభ్రాంతులకు గురిచేశారు. కేసు నుండి బయటపడాలంటే డబ్బులు పంపాలని నమ్మించి, విడతల వారీగా మొత్తం రూ. 92,70,000/- (తొంబై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు) దోచుకున్నారు. మదనపల్లి 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు.
కర్ణాటకకు చెందిన నిందితుడి అరెస్ట్
ఈ నేరంలో కీలక పాత్ర పోషించిన కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సిరిగుప్పకు చెందిన లింగబలిజ విరూపాక్ష (24) అనే నిందితుడిని సోమవారం మదనపల్లి-అంగళ్లు రోడ్డులోని ఆర్.కె. టైల్స్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 10 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నేరగాళ్ల మోసపూరిత పద్ధతి
ఈ ముఠా కాంబోడియా, కువైట్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉంది. ఫేక్ ఎఫ్‌ఐఆర్‌లు, డ్రగ్ కేసుల పేరుతో బాధితులను భయపెట్టడం వీరి ప్రధాన వృత్తి. దోచుకున్న సొమ్మును తొలుత ‘మ్యూల్’ ఖాతాల్లోకి మళ్లించి, ఆపై ఏటీఎంల ద్వారా డ్రా చేసేవారు. సాక్ష్యాలు దొరకకుండా వాట్సాప్‌లో పంపిన డిపాజిట్ స్లిప్పులను వెంటనే డిలీట్ చేసేవారు. నగదును వివిధ వ్యాపారాల పేరుతో లేయరింగ్ చేసి మళ్లించేవారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: – జిల్లా ఎస్పీ.. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో డబ్బులు అడగవని, బ్యాంకు వివరాలు కోరవని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా సిబిఐ లేదా ఇతర విభాగాల పేరుతో భయపెడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
పోలీసు బృందానికి ప్రశంసలు
క్లిష్టమైన ఈ సైబర్ కేసును ఛేదించిన మదనపల్లి వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. రాజారెడ్డి, సైబర్ క్రైమ్ సీఐ మహమ్మద్ అలీ, ఎస్‌ఐ రహీముల్లా మరియు వారి బృందాన్ని, సైబర్ క్రైమ్ పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీసులకు నగదు రివార్డులు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి కూడా పాల్గొన్నారు.
Tags; Digital Arrest’ Scam: Impersonating CBI Officials