– అదనపు ఎస్పీ వెంకటాద్రి
మదనపల్లి ముచ్చట్లు:
దేశాభివృద్ధిలోను, సామాజిక సమానత్వ సాధనలోనూ మహనీయులు చూపిన బాటలో నడవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) యం వెంకటాద్రి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, ఆదివారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పగుచ్చాలతో ఘన నివాళులర్పించారు.
అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, దళిత బాంధవుడిగా, అలుపెరుగని పోరాట యోధుడిగా బాబు జగ్జీవన్ రామ్ భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయం ప్రతిబింబించేలా చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదని, సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరమని గుర్తుచేశారు. ప్రజలచేత ‘బాబూజీ’ అని ఆప్యాయంగా పిలిపించుకున్న ఆయన, పరిపాలనా దక్షతకు నిలువుటద్దమని అదనపు ఎస్పీ అన్నారు.
నేటి యువత మరియు పోలీసు సిబ్బంది అటువంటి గొప్ప నాయకుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకుని, కులమతాలకు అతీతంగా సమసమాజ స్థాపనకు బాధ్యతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ డి. ఏడుకొండల రెడ్డి , ఆర్ఎస్ఐ లు జి.రవి, యం.చంద్రశేఖర్, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
Tags: An egalitarian society is built upon the ideals of great personalities.