April 5, 2026
Explore
డా. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం

డా. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం

April 5, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, డా. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని.. ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, స్థానిక శాసనసభ్యులు షాజహాన్ భాష పేర్కొన్నారు.

ఆదివారం మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో… డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ,, స్థానిక శాసనసభ్యులు షాజహాన్ భాష, డి.ఆర్.ఓ మధుసూదన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం జేసి మాట్లాడుతూ… సమతావాది, మానవతావాది, సుపరిపాలనాదక్షుడు డా. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి మహోన్నతమైన సేవ చేశారన్నారు. 1908 ఏప్రిల్ 5న జన్మించిన డా. బాబు జగ్జీవన్ రామ్ చిన్నతనం నుంచి ధర్మ ప్రవర్తన, గురువుల ఎడల భక్తి భావాలు కలిగి ఉండేవారన్నారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా మూడు దశాబ్దాలకు పైగా దక్షతతో దేశానికి ఎంతో సేవ చేశారని చెప్పారు. బాబు జగ్జీవన్ రామ్ అణగారిన కులాల వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తి స్థాయిలో అందేవిధంగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 1971లో భారతదేశానికి మరియు పాకిస్తాన్ కి మధ్య జరిగిన యుద్ధ సమయంలో బాబు జగ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దేశ ప్రజలలో స్ఫూర్తిని నింపారన్నారు. దేశం పట్ల అదే స్ఫూర్తిని జిల్లా ప్రజలందరూ కొనసాగించాలని కోరారు.

కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ… బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. 1936లో నామినేటెడ్ అసెంబ్లీ సభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన, అనంతరం పార్లమెంటేరియన్‌గా సేవలందిస్తూ దేశ ఉప ప్రధానిగా ఎదిగి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసినట్లు తెలిపారు.
అలాగే, బాబా సాహెబ్ అంబేద్కర్ గారితో పాటు బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా దేశానికి పునాదులు వేసిన నాయకులలో ఒకరని, సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహనీయులని వక్తలు గుర్తుచేశారు.
స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొన్న ఆయన 1942 ఉద్యమంలో కూడా భాగస్వామ్యమై, అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని తెలిపారు. దేశం కోసం జీవించి, దేశమే తన సర్వస్వమని భావించిన మహానేతగా ఆయనను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు… సమాజంలో అణగారిన వర్గాల ఆశాకిరణం. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం. చిన్న స్థాయి నుంచి ప్రారంభించి, తన కృషి, పట్టుదలతో దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన, నిజమైన ప్రజానాయకుడిగా నిలిచారని కొనియాడారు. “దేశమే నా ప్రాణం” అనే భావంతో ఆయన పనిచేశరని మనందరం ఆయన ఆశయాలను మన జీవితాల్లో ఆచరించాలని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవల గురించి పలువురు వక్తలు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటసుబ్బయ్య, జిల్లా టూరిజం అధికారి నాగభూషణం, వివిధ శాఖల అధికారులు, వై.సుదర్శనం రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్, డివిఎంసి మెంబర్లు పి.శ్రీనివాసులు, చంద్రశేఖర్, బాస్ శివప్రసాద్, ఏం.ఆర్.పి.ఎస్.నరేంద్ర, ఎస్సీ ఎస్టీ నాయకులు బొజ్జప్ప, పి.వెంకటరమణ డైరెక్టర్ కురభ కార్పొరేషన్, దళిత సంఘర్షణ సంస్థ చిన్నప్ప, వివిధ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags; The services rendered by Dr. Babu Jagjivan Ram to the nation are unforgettable.