ప్రయాణం ప్రమాదమే
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం
పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు-బెంగళూరు ప్రధాన రహదారిపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈరోడ్డు గుంతలమయంకావడంతో ప్రయాణం నరకంగా మారింది. మరమ్మతులు చేయాలని ప్రజలు , పత్రికలు ఏకరువు పెట్టాయి. దీనిని ఆసరాగా చేసుకుని కాంట్రాక్టర్లు, అధికారులు కలసి మరమ్మతుల పేరుతో గత రెండు నెలల క్రితం గుంతల రోడ్డును జెసిబిలతో పెరికివేశారు. కత్తార్లపల్లె క్రాస్ నుంచి అరవపల్లె వరకు ప్యాచ్ వర్క్ చేసి ఆపివేశారు. అదే సమయంలో పుంగనూరు గంగజాతర రావడంతో పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులు హడావుడి చేసి , గుంతలు ఉన్న చుట్టు ప్రక్కల రోడ్డును జెసిబిలతో పెరికేశారు. ఆనాటి నుంచి నేటి వరకు అధికారుల నిర్లక్షం కారణంగా పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా వదిలివేశారు. అలాగే కొన్ని ప్రాంతాలలో అర్ధంరోడ్డును , మరి కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా రోడ్డును పెరికి అర్ధాంతరంగా పనులు ఆపేశారు. ముఖ్యంగా అరవపల్లె, సింగిరిగుంట, మార్లపల్లె, యాబైరాళ్ల వెహోరవ వద్ద , చెరువు కట్టపైన సుమరు రెండు కిలో మీటర్ల మేర ఒక వైపు మట్టిదిబ్బలు తోలి వాటిని కూడ చదును చేయకుండ వదిలేయడం అధికారుల పనితీరును వెక్కిరిస్తోంది.
దుమ్ము నిండిపోతోంది….
అసలే ఇరుకైన రోడ్డు కావడం, అందులో మట్టి దిబ్బలు ఒక వైపు ఉండటం, మరో వైపు పెరికివేసిన రోడ్డుపై వాహనాల రాకపోకలతో దుమ్మురేగి పోయి మంచును తలపిస్తుండటంతో ప్రయాణం నరకంగా మారుతోంది. ప్రమాదాలకు నిలయమైన పుంగమ్మ చెరువు కట్టపై రహదారి పై కూడ మట్టి దిబ్బలు అలాగే వదిలేయడంతో ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలతో దుమ్మురేగి వాహనాలు ఢీకొనే ప్రమాదం జరుగుతోంది. మరో వైపు చెరువు కట్ట క్రింద కట్టక్రిందపాళెంలో సుమారు 1500 కుటుంబాలు ఉన్నాయి. దుమ్ము చెలరేగి ఇండ్లలో , వాహనాలపై దుమ్మునిండిపోతోంది. తలుపులు , కీటికిలు తీస్తే దుమ్ము ఇంటిలోనికి చేరి ఆహార పదార్థాలు సైతం దుమ్ముతో నిండిపోతోందని కట్టక్రిందపాళెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతులు ఏప్పుడు చేస్తారు….
పుంగమ్మ చెరువు కట్ట రహదారిపై ఒక వైపు చెరువునిండ నీరు, మరో వైపు 20 అడుగుల క్రింద పొలాలు ఉండటంతో ప్రమాదాలు ఊహించలేమంటు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రహదారిపై తోలిన మట్టి దిబ్బలను రోడ్డుపై చదును చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండ చేయాలని, తారు రోడ్డును తక్షణమే వేసి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇకనైన కాంట్రాక్టర్, అధికారులు నిర్లక్షం చేయకుండ రోడ్డు పనులు పూర్తి చేస్తారా..? లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం….
నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే బెంగళూరు రహదారిని మరమ్మతులు చేయడంలో అధికారులు చూపుతున్న నిర్లక్షం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. గుంతలరోడ్డును బాగుచేయమంటే రోడ్డును జెసిబిలతో పెరికేసి వదిలేస్తారా ..? ఇలాంటి రోడ్డును మరమ్మతులు చేయాలన్న ఆలోచన అధికారులకు , కాంట్రాక్టర్‌కు లేకపోవడం బాధకరం.

- నాగరాజారెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్, పుంగనూరు.
అధికారులకు బాధ్యత లేదు….
పుంగనూరు – బెంగళూరు రహదారి గుంతలమయం కావడంతో మరమ్మతులు చేయాలని ఉపాధ్యాయులతో పాటు పలు సంఘాలు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. అలాంటి రోడ్డును మరమ్మతులు చేస్తామని రెండు నెలల క్రితం జెసిబిలతో రోడ్డును పెరికేసి రోడ్డుపై మట్టి దిబ్బలను తోలి వదిలేశారు. అధికారులకు బాధ్యత లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు నిదర్శనం. తక్షణమే రోడ్డును వేయాలి. లేకపోతే ఆందోళన చేపడుతాం.

- వెంకట్రమణారెడ్డి, ఏఐటియుసి కార్యదర్శి, పుంగనూరు.

Tags: They dug up the road in the name of repairs and left it unfinished.