April 4, 2026
Explore
వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం

April 4, 2026 | Andhra Pradesh

తిరుప‌తి ముచ్చట్లు:

– రాత్రి ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శ‌నివారం ఆలయ సమీపంలోని పుష్క‌రిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో ఊరేగింపుగా పుష్క‌రిణి వ‌ద్ద‌కు వేంచేశారు.

ఉదయం 10.30 నుండి 11.15 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు అందుకున్నారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో ప్ర‌శాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 5న‌ శ్రీ కోదండరాముని పుష్పయాగం :

శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వ‌హించ‌నున్నారు.

Tags: Chakra Snanam of Sri Kodandarama at Ontimitta Celebrated with Grandeur