April 4, 2026
Explore
నేషనల్ హైవే 167పై కొత్తగా బైపాస్!

నేషనల్ హైవే 167పై కొత్తగా బైపాస్!

April 4, 2026 | Andhra Pradesh

మంత్రాలయం ముచ్చట్లు:

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రహదారుల విస్తరణ, బైపాస్‌ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో, కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద ఎన్ హెచ్ 167 పై బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన నిధులను ఇటీవల మంజూరు చేసింది. తాజాగా, ఈ కీలక ప్రాజెక్టుకు తొలిఅడుగు పడింది.

👉మంత్రాలయం వద్ద బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

  • శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.రూ.59 కోట్లతో నిర్మించే రెండు లేన్ల ఈ రహదారి పూర్తి అయితే మంత్రాలయానికి ట్రాఫిక్ చిక్కులు తొలగిపోతాయని స్థానికులు భావిస్తున్నారు .శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న మంత్రాలయానికి దేశ, విదేశాల నుండి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు.

👉బైపాస్ రోడ్డు నిర్మాణం చెయ్యాలని ప్రభుత్వ నిర్ణయం ఇందుకే

  • నిత్యం దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులను ఆకర్షించే మంత్రాలయ క్షేత్రానికి వెళ్లేవారి సౌకర్యం కోసం ప్రభుత్వం బైపాస్ రోడ్డు నిర్మాణం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు సైతం ఇక్కడికి తరలి వచ్చే క్రమంలో పెరుగుతున్న భక్తుల, స్థానికుల వాహనాల రద్దీతో జాతీయ రహదారి 167 పట్టణం మధ్యగా వెళుతుండటంతో తరచుగా ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

👉కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బైపాస్‌ రోడ్డు కోసం విజ్ఞప్తి

  • ఈ సమస్య పరిష్కారంపై శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బైపాస్‌ రోడ్డు ఆవశ్యకతను వివరించారు. వారి అభ్యర్థన మేరకు కల్లుదేవకుంట – చెట్నేపల్లి మధ్య 4 కిలోమీటర్ల మేర బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి అనుమతి లభించింది. ఇందుకోసం రూ.59 కోట్ల నిధులు మంజూరై, ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కూడా పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

👉మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అడుగులు

  • మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి భూమి పూజ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. మంత్రాలయం క్షేత్ర అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.మొత్తానికి ఏపీ ప్రభుత్వం రహదారులను మెరుగుపరచటానికి విశేషంగా కృషి చేస్తుంది.

Tags: New Bypass on National Highway 167!