తిరుపతి ముచ్చట్లు:
- డ్రగ్స్ నిర్మూలనకు సైకిల్ యాత్ర యువతలో చైతన్యానికి నూతన దిశ.
- ఈ నెల 6వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్ర పోస్టర్‌ను ఈగల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్పీ గారు తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాత్ర శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుండి ప్రారంభమై 17 రోజుల పాటు 13 జిల్లాల గుండా సాగనుంది. ప్రజా చైతన్యం కోసం ఈ యాత్ర చేపట్టిన వైబ్రంట్స్ ఆఫ్ కలాం వ్యవస్థాపకులు శ్రీ విజయ్ కలాం గారిని ఎస్పీ గారు అభినందించారు. ఏప్రిల్ 6న జరిగే ప్రారంభ కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలని కోరారు.
- ఈ సందర్బంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ, మహాత్మ గాంధీ స్ఫూర్తితో దేశ యువతలో మాదక ద్రవ్యాల పట్ల చైతన్యం కలిగించాలనే లక్ష్యంతో “వైబ్రంట్స్ ఆఫ్ కలాం” సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు సుమారు 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని, ప్రతి పౌరుడు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
- డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని, సమాజం మొత్తం కలిసి ముందుకు వస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని ఎస్పీ గారు స్పష్టం చేశారు. ఈ సైకిల్ యాత్ర ద్వారా యువతకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
- డ్రగ్స్ అనే సామాజిక వ్యాధి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి యువతను సరైన దారిలో నడిపించాలని సూచించారు.
- డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించడం ద్వారా సమాజ రక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
- యువత దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ, వారు తప్పుడు అలవాట్లకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా తమ శక్తిని సానుకూల దిశలో వినియోగించుకోవాలని, చెడు స్నేహితుల ప్రభావానికి లోనుకాకుండా జాగ్రత్తపడాలని అన్నారు.
- డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు మాత్రమే కాకుండా సమాజం మొత్తం కలసి పని చేయాల్సిన అవసరం ఉందని, యువతకు సరైన మార్గనిర్దేశం చేస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించగలమని ఎస్పీ స్పష్టం చేశారు.
- ఈ కార్యక్రమంలో వైబ్రంట్స్ ఆఫ్ కలాం వ్యవస్థాపకులు విజయ్ కలాం, అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి, రాష్ట్ర కోఆర్డినేటర్ రవి రాజు, ఈగల్ టీమ్ సీఐ ప్రసాద్, కమల్, నియోజకవర్గ కోఆర్డినేటర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags:Argument with Father… Auto Driver Takes Revenge on Little Girl