April 1, 2026
Explore
ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు..సీఎం చంద్రబాబుకు క్లీన్‌చిట్

ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు..సీఎం చంద్రబాబుకు క్లీన్‌చిట్

April 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, తమ వారికి లబ్ధి చేకూర్చేలా డిజైన్ మార్చారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ అప్పట్లో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌లను నిందితులుగా చేర్చుతూ కేసు నమోదు చేసింది.

అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు దర్యాప్తును సమీక్షించిన సీఐడీ, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారణకు వచ్చింది. ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంటూ, ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ (వాస్తవ దోషం) కింద కేసును మూసివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. సీఐడీ నివేదికను వ్యతిరేకిస్తూ, తన వాదనలు వినాలని కోరుతూ ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఆళ్ల పిటిషన్‌లో సరైన కారణాలు లేవని పేర్కొంటూ దానిని కొట్టివేసింది. అనంతరం సీఐడీ క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదిస్తూ కేసును మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే… ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, ఆయన దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు వాటిని కొట్టివేసింది. తాజాగా ఏసీబీ కోర్టు తీర్పుతో చంద్రబాబుతో పాటు ఇతరులకు ఈ కేసులో క్లీన్‌చిట్ లభించినట్లయింది.

Tags; ACB Court Dismisses IRR Case; Gives Clean Chit to CM Chandrababu