November 29, 2026
Explore
పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి బెంగళూరు నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి బెంగళూరు నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

November 29, 2026 | Andhra Pradesh

ప్రకాశం జిల్లా ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఘటన

ఆగి ఉన్న కారును ఢీకొట్టిన లారీ..

మృతులు అద్దంకి మండలం చెరుకుంపాలెం వాసులు

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 15 ఏళ్ల బాలుడు

అద్దంకి మండలం చెరుకుంపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పంచాయతీ ఎన్నికల రెండో విడతలో ఓటు వేయడం కోసం బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రుసుము చెల్లించేందుకు ఒక ప్రైవేట్ బస్సు వెనుక ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారు.. లారీ, బస్సు మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న సోంపల్లి సాయి కుమార్, కోట కామేశ్వరమ్మతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. అయితే, కారులో ప్రయాణిస్తున్న 15 ఏళ్ల బాలుడు మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.

సమాచారం అందుకున్న హైవే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags: Four people killed in a road accident while traveling from Bengaluru to cast their votes in panchayat elections.