రంగారెడ్డి జిల్లా ముచ్చట్లు:
కన్నతల్లే పిల్లలను కడతేర్చిన వైనం..
కన్న పిల్లల్ని సంపు గుంతలో వేసి తాను దూకి ఆత్మహత్య యత్నం
ముగ్గురు ఆడపిల్లల మృతి
ప్రాణాలతో బయట పడిన తల్లి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో నిన్న (శనివారం)హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన కందెన చెన్నయ్య దంపతులు ఇద్దరు గొడవపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన బార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉన్న నీటి సంపులో దుంకింది. దీంతో ముగ్గురు కూతుళ్లు మృతి చెందగా తల్లి ప్రాణాలతో బయట పడినట్లు ప్రస్తుత సమాచారం. పూర్తి వివరాలు…
భర్తపై అనుమానం.. ముగ్గురు బిడ్డలకు మరణశాసనం!
అనుమాన భూతం.. మూడు పసిప్రాణాలకు మృత్యుశాపం!
భర్తపై అనుమానంతోనే ముగ్గురు బిడ్డలను సంపులో పడేసిందా?
ఎనిమిది నెలల కవలలతో పాటు రెండేళ్ల చిన్నారి దుర్మరణం.. తల్లి ప్రాణాలతో బయటపడిన వైనం
భర్త వాంగ్మూలంలో సంచలన విషయాలు..
కేశంపేట పోలీసుల దర్యాప్తు
అనుమానం అనే విషం ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కట్టుకున్న భర్తపై అనుమానం పెంచుకున్న ఓ తల్లి.. ఆ అభం శుభం తెలియని ముగ్గురు కన్నబిడ్డల పాలిట మృత్యువుగా మారిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భర్తపై ఉన్న అనుమానాల నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడిందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన ముగ్గురు చిన్నారులు ఇంట్లోని నీటి సంపులో విగతజీవులుగా మారిన హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన కందెన చందు అలియాస్ చెన్నయ్య, శ్రీవర్ష దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండేళ్ల ప్రియాంక, ఎనిమిది నెలల కవలలు ప్రిన్సి, ప్రీతి ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీ వర్ష ముగ్గురు పిల్లలను ఒక్కొక్కరిగా నీటి సంపులో పడేసి, అనంతరం తానూ అందులోకి దూకినట్లు ప్రాథమిక సమాచారం. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు పరుగున వచ్చి తల్లిని బయటకు తీశారు. అయితే అప్పటికే ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. తల్లి ప్రాణాలతో బయటపడగా, ముగ్గురు బిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
నా మీద అనుమానంతోనే ఈ ఘాతుకం.. భర్త ఆవేదన
ఈ ఘటనపై చిన్నారుల తండ్రి చందు వెల్లడించిన విషయాలు మరింత సంచలనం కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా తాను ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నాననే అనుమానంతో భార్య తనను ప్రశ్నిస్తుండేదని ఆయన తెలిపాడు. ఇదే విషయంపై మూడు రోజుల క్రితం చిన్నపాటి గొడవ జరిగిందని, తనపై ఉన్న అనుమానాన్ని తొలగించేందుకు ఫోన్‌ను స్పీకర్‌లో పెట్టి అందరి ముందే మాట్లాడానని వివరించాడు. దీంతో ఆమె శాంతించిందని చెప్పాడు.
ఘటన జరిగిన రోజు ఉదయం 10.30 గంటల సమయంలో భార్య వండిపెట్టిన భోజనం తిని, పని నిమిత్తం కేశంపేటకు వెళ్లి అక్కడి నుంచి షాద్‌నగర్‌కు వెళ్లానని చందు తెలిపాడు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పిల్లలు సంపులో పడ్డారంటూ తనకు ఫోన్ వచ్చిందని కన్నీరుమున్నీరయ్యాడు. ఇంటికి చేరుకున్న తర్వాత పోలీసుల సమక్షంలో భార్యను ప్రశ్నించగా, తానే ముగ్గురు పిల్లలను ఒక్కొక్కరిగా సంపులో పడేసి, అనంతరం తానూ దూకినట్లు చెప్పిందని వెల్లడించాడు.
అనుమానానికి ముగ్గురు చిన్నారులే బలయ్యారా?
భర్తపై ఉన్న అనుమానమే ఈ దారుణానికి కారణమని చందు ఆరోపిస్తున్నప్పటికీ, అసలు కారణాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది. మూడు రోజుల క్రితం జరిగిన చిన్నపాటి గొడవ తర్వాత అంతా సర్దుకున్నట్లే కనిపించిన కుటుంబంలో ఇంతటి ఘోరం జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్నటి వరకు ఇంట్లో బుడిబుడి అడుగులతో సందడి చేసిన ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న కేశంపేట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి తల్లి శ్రీ వర్షను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు దారితీసిన అసలు కారణాలు, కుటుంబ పరిస్థితులు, ఇతర అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానమే కారణమా? మరేదైనా బలమైన కారణం ఉందా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, మూడు పసిప్రాణాలు అర్ధాంతరంగా తనువు చాలించిన ఈ ఘటన తొమ్మిదిరేకుల గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది..
Tags; Motherhood consumed by flames in Shadnagar