- ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు.
- ఎన్నికల విధులతో పాటు ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న పోలీసు సిబ్బంది.
- వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లకు అండగా నిలుస్తూ మానవీయ సేవలు.
- భద్రతా విధులతో పాటు సేవా కర్తవ్యానికి సమ ప్రాధాన్యతనిస్తున్న తిరుపతి జిల్లా పోలీసులు.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల బందోబస్తు, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా పర్యవేక్షణ, ఓటర్ల క్యూలైన్ల క్రమబద్ధీకరణ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు పోలీసులు తమ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వృద్ధులు, నడవడానికి ఇబ్బంది పడుతున్నవారు, ఇతరత్రా సహాయం అవసరమైన ఓటర్లకు అండగా నిలుస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వృద్ధులకు, నడవలేని పరిస్థితిలో ఉన్న వారిని గుర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, స్వయంగా వారివద్దకు వెళ్లి ఇరువైపులా ఆసరాగా నిలిచి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా భద్రతను పర్యవేక్షిస్తూనే, ఓటర్ల ఇబ్బందులను గుర్తించి మానవీయంగా స్పందించిన పోలీసుల సేవా తత్పరత అక్కడి వారిని ఆకట్టుకుంది. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే పోలీసుల సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు తావులేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నిఘా, భద్రతా చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. ఎన్నికల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు భద్రత కల్పించడమే కాకుండా, ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ అవసరమైన సహాయం అందించడం కూడా పోలీసుల బాధ్యతగా భావిస్తూ తిరుపతి జిల్లా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.భద్రతతో పాటు సేవ, విధి నిర్వహణతో పాటు మానవీయతకు ప్రాధాన్యతనిస్తూ తమ ప్రత్యేక సేవా స్ఫూర్తిని చాటుతున్నారు.
Tags: Police demonstrate a spirit of humanitarian service during the second phase of the panchayat elections.