అమెరికా ముచ్చట్లు:
అమెరికాలోని ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం (IBM) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంస్థ కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో విదేశీ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభావిత ఉద్యోగులకు మూడు వారాల గడువు ఇచ్చి, ఇతర దేశాల్లోని ఐబీఎం కార్యాలయాలకు బదిలీ కావాలా? లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాలా? అనేది నిర్ణయించుకోవాలని సూచించినట్లు సమాచారం. డిసెంబర్ 31లోగా అమెరికా విడిచి వెళ్తే మూడు నెలల సెవెరెన్స్ ప్యాకేజీ (ఉద్యోగ విరమణ పరిహారం) అందించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భారత్‌కు తిరిగి వస్తే వేతనాల్లో భారీ కోత పడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌కు బదిలీ అయితే తన జీతం 80 శాతం తగ్గుతుందని ఓ ఉద్యోగి వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ వేతన కోత సంస్థ సాధారణ విధానమని ఐబీఎం ధృవీకరించలేదు.
మారుతున్న నైపుణ్యాల అవసరాలు, క్లయింట్ల డిమాండ్లకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంతో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే వివరాలను ఐబీఎం వెల్లడించలేదు.
ఐటీ రంగంలో మారుతున్న పరిస్థితులు.. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో కొత్త ఆందోళనకు కారణమవుతున్నాయి.
Tags: A shock for IBM employees in the US: Visa and Green Card sponsorship discontinued!