హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్‌లో చోటుచేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బక్కశెట్టి సింధూజ అలియాస్ తుషారిక (36) విషాద ఘటన నేటి యువతకు, ముఖ్యంగా ఉద్యోగ రీత్యా ఒంటరిగా జీవిస్తున్న వారికి ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని గుర్తుచేస్తోంది. ఒంటరిగా ఉండాలంటే ఎంతో మానసిక ధైర్యం కావాలి. ఆ ఒంటరితనం మనసును కుంగదీస్తోందని అనిపించినప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య గడపడమే అసలైన రక్షణ కవచమని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
జగిత్యాల జిల్లా గోవిందపల్లికి చెందిన సింధూజ హైటెక్ సిటీలోని ‘నెక్స్ట్‌టర్న్’ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తూ, మియాపూర్‌లోని ‘ప్రజయ్ మెగాపోలిస్’ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసం ఉంటోంది. 2015లో వివాహం కాగా ఏడాదిన్నర తర్వాత భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవనం కొనసాగిస్తోంది. విడాకుల తర్వాత ఎదురైన పరిస్థితులు, గత నాలుగు నెలలుగా వెంటాడిన తీవ్ర ఒంటరితనం ఆమెను మానసిక ఒత్తిడిలోకి నెట్టడంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది.
గురువారం ఉదయం సింధూజ పనిచేస్తున్న కంపెనీలోని ఆమె స్నేహితుడు రాజీరెడ్డి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో రాజీరెడ్డి ఆమె ఫ్లాట్‌కు వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్ రాడ్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు చివరిగా ఆమె రాసిన లేఖను గుర్తించారు. నాలుగు నెలలుగా తాను ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని, ఈ పరిస్థితుల నుండి బయటపడలేకపోతున్నానని లేఖలో తెలిపింది.
తనకు పిల్లలు అంటే ఇష్టమని, తన బ్యాంకు ఖాతాలోని డబ్బులను అనాథ పిల్లలకు చేర్చాలని కోరింది. కోర్టులో వివాదంలో ఉన్న ఆస్తికి సంబంధించిన కేసులను కొనసాగించాలని, తన ఆస్తి మొత్తాన్ని కేర్ ట్రస్ట్‌కు అందేలా చూడాలని కోరుతూ నోట్ రాసింది.
నేటి ఆధునిక జీవనశైలిలో ఎందరో యువతీయువకులు చదువు, ఉద్యోగాల పేరిట కుటుంబాలకు దూరంగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఒంటరిగా జీవించేటప్పుడు ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకునే మానసిక నిబ్బరం, ధైర్యం ఉండటం ఎంతో అవసరం. ఒకవేళ ఒంటరితనం భారంగా మారుతున్నా, మనసులో ఏదో తెలియని నిరాశ, ఒత్తిడి ఆవరిస్తున్నా ఏమాత్రం సంకోచించకుండా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి మధ్య గడపాలి.
మనసులోని వేదనను తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా ఆప్తులతో పంచుకుంటే ఆ బాధ సగమవుతుంది. అంతే కాని లోకాన్ని వీడటం ఏ సమస్యకూ పరిష్కారం కాదని గుర్తించి, ఆప్తుల ప్రేమ, ఓదార్పుతో ముందుకు సాగితే సింధూజ లాంటి ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు.
అలాగే మన చుట్టూ ఉన్న స్నేహితులు, సహోద్యోగులు ఒంటరిగా ఉంటున్నప్పుడు వారితో తరచూ మాట్లాడుతూ, వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వడం ఎంత ముఖ్యమో కూడా ఈ ఘటన తెలియజేస్తోంది.
Tags: When moments of weakness come back to haunt you, what is the use of all your education?