November 28, 2026
Explore
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.

November 28, 2026 | Andhra Pradesh

  • ప్రశాంత, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే తిరుపతి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం.
  • ఎన్నికల విధులపై బందోబస్తు సిబ్బందికి సమగ్ర అవగాహన, స్పష్టమైన ఆదేశాలు.
  • ఎన్నికల పంపిణీ కేంద్రంలో బందోబస్తు సిబ్బందితో సమావేశం నిర్వహించి విధివిధానాలపై దిశానిర్దేశం.
  • ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలను చేపట్టింది.

ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పంపిణీ కేంద్రంలో బందోబస్తు విధులకు హాజరైన పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి, ఎన్నికల విధుల్లో పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలు, విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సమగ్రంగా వివరించారు.

ఎన్నికల విధుల్లో ప్రతి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం నిఘా ఉంచాలని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఒత్తిడికి గురిచేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, మొబైల్ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియకు భరోసా కల్పించాలని, ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించినట్టు జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేశారు.

Tags:Tight security arrangements for the second phase of Gram Panchayat elections.