… జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లి ముచ్చట్లు:
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు, పౌరులుగా మనం నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతలపైనా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.
నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు… గురువారం రాయచోటి ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను పఠించి, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌరుల ప్రాథమిక బాధ్యతలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా దేశ పరిపాలన కొనసాగిందని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాల్లోని ఉత్తమ అంశాలను పరిశీలించి, భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని రూపొందించిందని తెలిపారు. ఏడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా, కాలానుగుణంగా కొన్ని సవరణలు జరిగినప్పటికీ భారత రాజ్యాంగం నేటికీ దేశ పరిపాలనకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
రాజ్యాంగంలో దేశ స్వరూపం, పౌరుల ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, అత్యవసర పరిస్థితులకు సంబంధించిన నిబంధనలతో పాటు దేశాభివృద్ధికి అవసరమైన అనేక అంశాలను పొందుపరిచారని వివరించారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా దేశవ్యాప్తంగా ఏకీకృత మార్కెట్ వ్యవస్థకు కూడా రాజ్యాంగం మార్గం సుగమం చేసిందని తెలిపారు.
ప్రస్తుత సమాజంలో చాలామంది తమకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడుతున్నప్పటికీ, పౌరులుగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతల గురించి తగినంతగా ఆలోచించడం లేదని అన్నారు.
దీనికి ఉదాహరణగా పారిశుద్ధ్యాన్ని ప్రస్తావిస్తూ, రోడ్లపై చెత్త వేయకూడదని ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కొద్దిమంది పారిశుద్ధ్య సిబ్బంది ఎంత కష్టపడి పనిచేసినా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ప్రాథమిక బాధ్యతల పట్ల అవగాహనను విద్యార్థి దశ నుంచే పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులకు ఈ విషయాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు.
Tags: Everyone should also have an understanding of their fundamental responsibilities.