November 24, 2026
Explore
మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సంక్షేమ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి.

మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సంక్షేమ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి.

November 24, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో ప్రాథమిక రంగాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సంక్షేమ రంగాల అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్‌లోని నీతి హాల్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల ప్రగతిని సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ పరిధిలో ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రెండు లక్షల హెక్టార్లలో సాగుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రబీ సీజన్‌లో ఉద్యానవన పంటలు, మైక్రో ఇరిగేషన్ విధానాల ద్వారా మూడు, నాలుగు నెలల్లో దిగుబడినిచ్చే పంటల సాగును ప్రోత్సహిస్తూ 8 వేల హెక్టార్ల సాగు లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రాథమిక రంగాల అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులకు అందుతున్న సేవలు పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

HNSS అధికారులు హంద్రీ-నీవా ప్రధాన కాలువకు సంబంధించిన పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. APSPDCL అధికారులు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో గుర్తించిన సోలార్ రూఫ్‌టాప్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బీసీ హాస్టళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రహరీ గోడల నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు పీలేరు, రాయచోటిలో హాస్టల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా పైపులైన్ల పనులను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తల ఖాళీ పోస్టుల వివరాలను సేకరించి సమగ్ర నివేదిక రూపొందించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని అభివృద్ధి పనుల పురోగతి, సాధించిన లక్ష్యాలు, పెండింగ్ పనుల వివరాలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని, పెండింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల అమలులో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

Tags:Special focus should be placed on the development of infrastructure, investments, and welfare sectors.