November 20, 2026
Explore
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తీవ్ర తుపాను

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తీవ్ర తుపాను

November 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు::

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తీవ్ర తుపాను తీరం వైపు చాలా నెమ్మదిగా కదులుతోంది. ఒక దశలో గంటకు కేవలం 3 కి.మీ వేగాన్నే కొనసాగించింది. శుక్రవారం ఏపీలోని నరసాపురం, ఒడిశాలోని పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇంతకు ముందు ఏర్పడిన మురసు, అర్నబ్ తుపాన్ లతో పోలిస్తే.. మరీ తక్కువ వేగంతో కదలడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అక్వాన్ మరీ అంత నెమ్మదిగా ఎందుకు కదులుతోంది? దీనివల్ల నష్ట తీవ్రత పెరిగే అవకాశం ఉందా?

👉 తుపాను ముందుకు కదలడానికి భూ ఉపరితలంపై గాలులు, పీడన వ్యవస్థల తోడ్పాటు అవసరం. గాలులు బలహీనంగా ఉంటే తుపాను చురుగ్గా తీరం వైపు కదులుతుంది. కానీ, ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. గాలులు వ్యతిరేక దిశలో వీస్తున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో వరుస తుపాన్లు ఏర్పడుతున్నాయి. దీంతో వాతావరణంలో సంక్లిష్టత పెరిగి.. తుపాను కదలిక నెమ్మదిగా ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

👉 తుపాను కదిలే వేగం దాని తీవ్రతను నిర్ధరించనప్పటికీ.. ఒక ప్రాంతంలో కురిసే వర్షం పరిమాణాన్ని ప్రభావితం చేస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2021లో హైడ్రోమెట్రాలజీ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. తుపాను కదిలే వేగానికి, దానివల్ల కురిసే వర్షపాతానికి మధ్య సంబంధం ఉంది. 2010-2019 మధ్య తీరాన్ని తాకిన 280 తుపాన్లపై అధ్యయనం చేయగా.. నెమ్మదిగా కదిలే తుపాన్ల వల్ల ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురిసినట్లు తేలింది. కొన్ని సందర్భాల్లో బలహీనమైన తుపానుల వల్ల కూడా తీవ్రమైన వరదలు వచ్చినట్లు గుర్తించారు. కేవలం తుపాను వేగం మాత్రమే వరద తీవ్రతను నిర్ణయించలేదని పరిశోధకులు తేల్చారు.

👉 ‘నేచర్ కమ్యూనికేషన్’లో మరో అధ్యయనం ప్రచురితమైంది. 2001 నుంచి 2021 వరకు ఏర్పడిన కొన్ని తుపానుల వల్ల కలిగిన వర్షపాతాలను ఉపగ్రహాల ఆధారంగా లెక్కించారు. వేగంగా కదిలే తుపాను వల్ల సగటున 24శాతం వర్షపాతం అధికంగా నమోదైనట్లు తేల్చారు. ఈ రెండు అధ్యయనాలను పరిశీలిస్తే.. నెమ్మదిగా కదిలే తుపాను ప్రభావం ఒక ప్రదేశంలో ఎక్కువగా ఉంటుంది. సగటు వర్షపాతం రేటు తక్కువగా ఉన్నప్పటికీ.. ఇది ఒక ప్రాంతంలో వర్షపాతాన్ని అధికంగా నమోదు చేస్తుంది. అందువల్ల తుపాను వేగం కంటే.. దాని తీవ్రత, పరిమాణం, వర్షపాత విస్తరణ, వాతావరణ వ్యవస్థలతో చర్యల వంటివి నష్టాన్ని ప్రభావితం చేస్తాయని పరిశోధకులు తేల్చారు.

Tags: ‘Akwan’ severe cyclonic storm forms over the west-central Bay of Bengal