తిరుమల ముచ్చట్లు:
పసివాడిని, తల్లిని వేరు చేసిన సిబ్బంది కఠినత్వం!
టీటీడీ ఈవో దృష్టికి క్యూలైన్ వేదన!
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆశతో కొండకు వచ్చే సామాన్య భక్తులకు క్యూలైన్లలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కొందరు టీటీడీ సిబ్బంది వ్యవహారశైలి, నిర్లక్ష్యం కారణంగా భక్తులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇటీవల క్యూలైన్ల వద్ద జరిగిన రెండు వేర్వేరు ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఘటన 1: తల్లి నుంచి పసివాడిని వేరు చేసిన వైనం.. రూ. 300 దర్శనం టోకెన్ వున్నా.. స్వామి దర్శనం లేకుండానే వెనుదిరిగిన తల్లి: ఒక కుటుంబం నెలల ముందే ఆన్లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకుని తిరుమలకు చేరుకుంది. కుటుంబంలోని ఐదుగురు పెద్దలకు టికెట్లు ఉండగా, వారితో పాటు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. క్యూలైన్లో నడిచి టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దకు రాగానే, ఆ ముగ్గురు పిల్లల్లో కొంచెం ఎత్తుగా ఉన్న ఒక బాలుడిని సిబ్బంది అడ్డుకున్నారు.
కనీసం తల్లిదండ్రులకు విషయం ఏంటో చెప్పకుండానే, అక్కడ విధుల్లో ఉన్న ఒక మహిళా సిబ్బంది ఆ బాలుడిని బిరబిరా లాక్కెళ్లి పక్కనే ఉన్న గేటు బయటకు నెట్టేసి లోపలి నుంచి గడియ పెట్టేశారు. కళ్లముందే తమ బిడ్డను అలా బయటకు పంపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో నిలదీశారు. “ఈ బాలుడికి వయసు ఎక్కువగా ఉంది, రూ. 300 టికెట్ ఉండాల్సిందే” అని అక్కడి సూపరింటెండెంట్ తేల్చి చెప్పారు.
దీంతో, తనకు దర్శనం టికెట్ ఉన్నప్పటికీ.. బయట ఒంటరిగా ఉన్న పసివాడిని వదిలి వెళ్లలేక ఆ కన్నతల్లి కన్నీళ్లతో దర్శనం చేసుకోకుండానే బయటకు వచ్చేసింది. మిగిలిన కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనం చేసుకోగా, ఆ తల్లి, కొడుకు మాత్రం దర్శన భాగ్యం లేకుండానే ఇంటికి వెనుదిరగాల్సి వచ్చింది.
ఘటన 2: అధికారుల పొరపాటుకు భక్తులకు శిక్ష.. ఐడీ కార్డు దాచుకున్న ఉద్యోగి: సుమారు మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు భక్తులు ఈవో కార్యాలయ సిఫార్సుతో రూ. 300 దర్శన టికెట్లు పొందారు. ఆఫీసులో టికెట్లు తీసుకుని, కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో నడిచి స్కానింగ్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ టికెట్లు స్కాన్ చేసిన సిబ్బంది, భక్తులకు ఏమీ చెప్పకుండానే పక్కకు పిలిచి గేటు బయటకు పంపించి గడియ పెట్టేశారు.
భక్తులు గట్టిగా ప్రశ్నించగా..
“మీ దర్శనం తేదీ రేపు ఉంది, ఇవాళ కాదు” అని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. “మేము ఇవాల్టి కోసమే అడిగాము, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది” అని భక్తులు ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. పైగా, భక్తులను బయటకు పంపించే ముందు సదరు ఉద్యోగి తన మెడలోని ఐడీ కార్డును తీసి జేబులో దాచుకోవడం గమనార్హం.
అనంతరం..
బాధితులు తిరిగి ఈవో ఆఫీసుకు వెళ్లి ఆరా తీయగా.. “పొరపాటున రేపటి తేదీ ముద్రించాము, మీరు క్యూలో వస్తున్నారని అక్కడి సూపరింటెండెంట్‌కు సమాచారం కూడా ఇచ్చాము కదా” అని సిబ్బంది తెలిపారు. తిరిగి అక్కడి నుంచి ఫోన్ చేసి ‘మిస్ కమ్యూనికేషన్ జరిగింది’ అని చెప్పడంతో, అప్పుడు ఆ ముగ్గురినీ దర్శనానికి అనుమతించారు. కనీసం భక్తుల మాట విని, సమస్య ఏంటో తెలుసుకునే ఓపిక కూడా లేకుండా పశువులను తోలినట్లు బయటకు గెంటేయడం ఎంతవరకు సమంజసమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గందరగోళంలో భక్తుల నరకయాతన.. ప్రత్యామ్నాయ మార్గాలేవి? క్యూలైన్లలో వెళ్తున్నప్పుడు సెల్ఫోన్లు కూడా అందుబాటులో ఉండవు. అలాంటి సమయంలో టికెట్ కారణం చూపి కుటుంబ సభ్యులు లేదా మిత్రుల బృందం నుంచి ఒకరిని అకస్మాత్తుగా బయటకు గెంటేస్తే, లోపలికి వెళ్లిన వారిని బయట ఉన్నవారు ఎలా కలుసుకోవాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త ప్రదేశంలో, ఎక్కడ వేచి చూడాలో తెలియక భక్తులు తీవ్ర మానసిక ఒత్తిడికి, నరకయాతనకు గురవుతున్నారు.
ఐదుగురికి రూ. 300 చొప్పున చెల్లించి టికెట్లు కొనుక్కున్న కుటుంబం, కేవలం ఒక్క పిల్లాడి టికెట్ కోసం మోసం చేయాలని అనుకోదు. పిల్లల వయసు నిర్ధారణ విషయంలో అవగాహన లోపం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
ఇలాంటి సందర్భాల్లో:
- అక్కడికక్కడే రూ. 300 రుసుము వసూలు చేసి, రసీదు ఇచ్చి దర్శనానికి అనుమతించే ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.
- ఒకవేళ అక్కడ నగదు వసూలు చేస్తే అక్రమాలు జరుగుతాయని టీటీడీ భావిస్తే.. కనీసం ఆ కుటుంబం విడిపోకుండా, టికెట్ లేని వారిని అక్కడి నుంచే నేరుగా ఉచిత సర్వదర్శనం క్యూలైన్లోకి పంపించే వెసులుబాటు కల్పించాలని సూచిస్తున్నారు.
- భక్తులు సమర్పించే కానుకలతోనే నడుస్తున్న టీటీడీ వ్యవస్థలో, క్షేత్రస్థాయి సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నిత్యం ఎదురవుతున్న ఈ తరహా సమస్యలపై టీటీడీ ఈవో గారు ప్రత్యేక దృష్టి సారించి, భక్తులు కుటుంబాల నుంచి విడిపోకుండా ఉండేలా శాశ్వత పరిష్కారం చూపాలని సామాన్య భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:Severe humiliation for devotees in the Tirumala queue lines..