November 19, 2026
Explore
ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు!

ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు!

November 19, 2026 | Andhra Pradesh

తిరుపతిముచ్చట్లు:

పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్‌కు తీసుకెళ్లి.. బండరాయితో దారుణ హత్య!

తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన భాగ్యశ్రీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను ఆటోలో తీసుకెళ్లి బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 31న తిరుపతి రూరల్ పరిధిలోని సి.మల్లవరం సమీపంలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో పోలీసులకు మృతురాలి వివరాలు తెలుసుకోవడం సవాలుగా మారింది. చివరకు దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా ఆమె చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన భాగ్యశ్రీగా గుర్తించారు.

కాల్ డేటాతో చిక్కిన నిందితుడు!

సీసీ కెమెరాలు, ఏఎన్‌పీఆర్ ఫుటేజీలు, కాల్ డేటా, మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ జమాలుల్లా బాషా అలియాస్ జమీల్ బాషా (38) ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ నెల 16న రొంపిచెర్ల క్రాస్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగ్యశ్రీ తన సహోద్యోగులతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. తన ఆటోలో ఆమెను సి.మల్లవరం సమీపంలోని వెంచర్‌కు తీసుకెళ్లి గొడవ అనంతరం బండరాయితో హత్య చేసినట్లు తెలిపారు.

నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన ఆటో, రెండు సెల్‌ఫోన్లు, రూ.450 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

17 రోజుల్లోనే మిస్టరీ ఛేదన!

ఎలాంటి ఆధారాలు లేని ఈ హత్య కేసును సాంకేతిక ఆధారాలతో 17 రోజుల్లో ఛేదించిన తిరుపతి రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అభినందించారు.

అనుమానం మనిషిని ఎంతటి దారుణానికి ఒడిగట్టిస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Tags: An acquaintance formed in the name of love—ended in a life taken out of suspicion!