March 31, 2026
Explore
మోహిని అలంకారంలో పల్లకిపై విహరించిన కోదండరాముడు – భక్తులకు కనువిందు

మోహిని అలంకారంలో పల్లకిపై విహరించిన కోదండరాముడు – భక్తులకు కనువిందు

March 31, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఈ వాహనసేవ భక్తి భావంతో వైభవంగా జరిగింది. భజన బృందాల హారతులు, కోలాటాల మధ్య స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో ఎంతో రమణీయంగా వర్ణించబడింది. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి అమృతం లభించినప్పుడు దానిని పంచుకునే విషయంలో కలహం చెలరేగుతుంది. ఆ కలహాన్ని నివారించి అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీహరి మోహిని రూపంలో అవతరించారు. తన భక్తులు కానివారు మాయకు లోనవుతారని, భక్తులు మాత్రం ఆ మాయను సులభంగా అధిగమించగలరని ఈ మోహిని రూపం ద్వారా స్వామివారు సూచిస్తున్నారని పురాణాలు తెలియజేస్తున్నాయి.వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు.ఈ రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా గరుడసేవ జరగనుంది.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Tags; Lord Kodandarama, Gracing a Palanquin in the Guise of Mohini—A Visual Feast for Devotees.