November 14, 2026
Explore
టిటిడిలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

టిటిడిలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

November 14, 2026 | Andhra Pradesh

తిరుపతిముచ్చట్లు:

ఈ నెల 20వ తేదీ వరకు ప్రత్యేక పుస్తక ప్రదర్శనలు

టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర కేంద్రీయ గ్రంథాలయం మరియు పరిశోధన సంస్థలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు, విద్యార్థులు, పాఠకుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు భారతీయ సనాతన ధర్మం, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, పోటీ పరీక్షలుపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్, శ్రీ వేంకటేశ్వర కేంద్రీయ గ్రంథాలయం మరియు పరిశోధన సంస్థ ఇన్‌చార్జి డా. వేమా వేంకటరత్నం మాట్లాడుతూ, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు, జేఈవోలు డా. ఎ. శరత్, ప్రభల గోపినాథ్ సూచనల మేరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు ఉపయోగపడే విజ్ఞానదాయకమైన, స్ఫూర్తిదాయకమైన పుస్తకాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా టీటీడీ చేపడుతున్న సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రతిరోజూ ఒక్కో ప్రత్యేక అంశం ఆధారంగా ప్రదర్శనకు ఉంచుతున్నట్లు వివరించారు.

వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, పాఠకుల్లో సృజనాత్మకత, విజ్ఞానం, అధ్యయన ఆసక్తిని ప్రోత్సహించేందుకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వ్యాసరచన , క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు నవంబర్ 20వ తేదీన బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

టీటీడీ కల్పించిన ఈ సదవకాశాన్ని పాఠకులు, టీటీడీ విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, దాతలు, గ్రంథాలయ అభిమానులు సద్వినియోగం చేసుకుని జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

ప్రముఖ గ్రంథాలయ పితామహులకు ఘన నివాళి

అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రంథాలయ రంగానికి విశేష సేవలందించిన గ్రంథాలయ పితామహుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గ్రంథాలయ శాస్త్రవేత్త ఎస్.ఆర్. రంగనాథన్, టీటీడీ గ్రంథాలయం వ్యవస్థాపకులు డా. ఎక్కిరాల కృష్ణమాచార్య, అయ్యంకి వేంకటరామయ్య, పాతూరి నాగభూషణం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఏఈవో అరుణాదేవి, సూపరింటెండెంట్ సుశీల, గ్రంథాలయ ఇన్‌చార్జి డా. బాలాజీ దీక్షితులు, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

Tags; National Library Week celebrations begin on a grand scale at TTD