ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్
సమస్యలను విన్నవించుకున్న 35 మంది అర్జీదారులు
అర్జీలను సంతృప్తికర రీతిలో చట్టపరిధిలో పరిష్కరించాలి
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
హైదరాబాద్ ముచ్చట్లు:
ఫిర్యాదిదారుల అర్జీలను సంతృప్తికర రీతిలో చట్టపరిధిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల అర్జీలను జిల్లా ఎస్పీ స్వయంగా స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుని, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన మోసాలు తదితర పలు సమస్యలను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా విన్నవించుకున్నారు. అర్జీలను చట్టపరిధిలో విచారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు.
వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు అర్జీలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే అర్జీలను సంతృప్తికర రీతిలో చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కరానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపవలెనని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 35 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పీ పి. జగదీష్ నాయక్, ఎస్.సి ఎస్.టి సెల్ ఇన్స్పెక్టర్ బాలనాగిరెడ్డి, పిజిఆర్ఎస్ సెల్ ఎస్.ఐ లక్ష్మీరాజ్యం, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags:Platform for Resolving Public Issues