విశాఖ ముచ్చట్లు:
రూ.1.41 లక్షల కోట్లతో 12 కీలక ఒప్పందాలు.. 10,919 మందికి ఉద్యోగాలు..!
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజూ ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రూ.1,41,585 కోట్ల విలువైన 12 కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 10,919 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ ఒప్పందాల్లో ఎయిర్‌ట్రంక్–జేసీకే ఇన్‌ఫ్రా సంస్థ రూ.1.03 లక్షల కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జిందాల్ గ్రూప్, ఇండియన్ ఆయిల్, గ్రీన్ జెన్, డిక్సన్ టెక్నాలజీస్, కాకినాడ సీపోర్ట్స్, అగ్నికుల్ కాస్మోస్, ఒబెరాయ్ వంటి ప్రముఖ సంస్థలు కూడా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి.
పెట్టుబడులతో పాటు సామాజిక బాధ్యతకు కూడా ప్రాధాన్యత లభించింది. పీ4 కార్యక్రమంలో భాగంగా 25 వేల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఐటీసీ సంస్థ ముందుకొచ్చింది. 1,120 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు రూ.32.48 కోట్ల స్కాలర్‌షిప్‌లు అందించేందుకు హీరో మోటార్స్ కార్ప్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు కీలక సూచనలు చేశారు. ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అమలుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. పీ4 కార్యక్రమానికి ముందుకొచ్చిన ఐటీసీ, హీరో మోటార్స్ సంస్థలను అభినందించారు.
దేశంలోని ఐఐటీలు ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రయోగశాలగా మార్చుకుని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యాక్సెస్ టు ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం హ్యాపీ, హెల్తీ, వెల్తీగా ఉండాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు ప్రోత్సాహం.. ఇలా అన్ని రంగాల్లోనూ విశాఖ వేదికగా ఏపీ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది.
Tags: A massive influx of investments for AP at the CII summit in Visakhapatnam..