November 13, 2026
Explore
పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్

పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్

November 13, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్ (13.11.2026) ఉదయం 11:00 గంటలకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TG ICCC) భవనంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నగర పోలీసింగ్‌పై తమ ప్రాధాన్యతలను, కార్యాచరణను వివరించారు.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మళ్లీ సేవ చేసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి కి, మంత్రివర్గానికి, సలహాదారులకు, డీజీపీ గారికి, సీనియర్ అధికారులకు కమిషనర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో పనిచేయడం ఇది మూడోసారి అని గుర్తుచేసుకుంటూ, 2004కు ముందు కమిషనర్లు ఆర్.పి. సింగ్, దినేష్ రెడ్డి హయాంలో సౌత్ జోన్ డీసీపీగా, 2010 చివరలో జాయింట్ సీపీ (అడ్మిన్)గా రెండేళ్లు, జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్)గా 7–8 నెలలు పనిచేశానని తెలిపారు. ఆ తర్వాత రాచకొండ కమిషనర్‌గా, సీఐడీలో ఏడాది పాటు, రైల్వే, రోడ్ సేఫ్టీ విభాగాలలో, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా, డీజీ ర్యాంకులో దాదాపు రెండేళ్ల ఐదు నెలలు బాధ్యతలు నిర్వర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్ అర్బన్ రీజియన్ పునర్వ్యవస్థీకరణ తర్వాత శంషాబాద్, రాజేంద్రనగర్ వంటి కొత్త జోన్లతో పాటు పాత రాచకొండ పరిధిలోని ఆదిభట్ల, పహాడీషరీఫ్, బాలాపూర్, షాద్‌నగర్ వంటి ప్రాంతాలు కలవడంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధి చాలా విస్తరించిందని, మల్కాజిగిరి కమిషనరేట్ విభజన తర్వాత కూడా పోలీసింగ్ సవాళ్లు ఒకే విధంగా ఉన్నాయని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.

నగరంలో శాంతిభద్రతల (లా అండ్ ఆర్డర్) పరిరక్షణ, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ తమ మొదటి ప్రాధాన్యతలని కమిషనర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అనుభవం ఉన్న అధికారుల బృందం ఉందని, అందరం కలిసి ఒక బృందంగా (టీమ్ వర్క్) పనిచేసి హైదరాబాద్‌ను ‘సేఫ్ సిటీ’గా నిలబెడతామన్నారు. శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే నగరానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నామనే భావన కల్పించడమే ప్రభుత్వ, పోలీసు శాఖల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్‌లు, గ్రూప్ తగాదాలు, ప్రతీకార నేరాల నియంత్రణకు జైలు నుండి విడుదలయ్యే వారి వివరాలను ‘టీ-స్పార్క్’ (T-SPARK), సీసీటీఎన్‌ఎస్ (CCTNS) లతో అనుసంధానించి ప్రత్యేకంగా ‘జైల్ రిలీజ్ వాచ్’ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతీకార దాడులకు పాల్పడే వారిపై స్థానిక పోలీసు, స్పెషల్ బ్రాంచ్, కమ్యూనిటీ నెట్‌వర్క్‌ల ద్వారా సమాచారం సేకరించి మళ్లీ బైండోవర్ చేయడం, ఆర్థిక పూచీకత్తు (ఫైనాన్షియల్ ష్యూరిటీ) తీసుకోవడం, రౌడీ షీట్లు తెరవడం వంటి చర్యలు చేపడతామన్నారు. హత్యల వంటి తీవ్రమైన కేసులలో తక్షణమే నిందితులను అరెస్ట్ చేస్తామని, మొదటిసారి నేరం చేసిన వారు మళ్లీ నేరాల వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ నియంత్రణకు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కొత్త నిబంధనలను ఉపయోగిస్తామన్నారు. తరచూ నేరాలకు పాల్పడేవారిపై (హ్యాబిచువల్ అఫెండర్స్), కమర్షియల్ క్వాంటిటీ (20 కిలోలు ఆపై) డ్రగ్స్ కేసుల నిందితులపై ఖచ్చితంగా పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసి 8 నెలల నుండి ఏడాది పాటు జైలులో ఉంచుతామన్నారు. ‘ఈగల్’ (EAGLE) విభాగం ద్వారా దర్యాప్తు నాణ్యతను పెంచి, సంబంధిత మెజిస్ట్రేట్లు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి గారి సమన్వయంతో డ్రగ్స్ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయించి, పెండింగ్ కేసులలో నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడేలా ప్రత్యేక ట్రయల్ మానిటరింగ్ చేస్తామని స్పష్టం చేశారు.

ముందుగా డీసీపీలు, ఏసీపీలతో చర్చించి ప్రతి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్థానిక సమస్యలను అధ్యయనం చేస్తామని, ఆ తర్వాత బేసిక్ పోలీసింగ్‌పై పూర్తి దృష్టి సారిస్తామని కమిషనర్ ప్రకటించారు. సాయంత్రం వేళల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున సిబ్బంది పోలీస్ స్టేషన్లలో కూర్చోకుండా రోడ్లపైకి వచ్చి చురుకుగా పెట్రోలింగ్ చేయాలని, రాత్రిపూట పెట్రోలింగ్ ఖచ్చితంగా అమలు చేసి మరుసటి రోజు ఉదయం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా ప్రజలకు సహాయపడాలన్నారు. అవినీతి విషయంలో ‘జీరో టాలరెన్స్’, సివిల్ సెటిల్‌మెంట్లకు ‘నో’ అనే తన కఠిన సూత్రాలను పునరుద్ఘాటిస్తూ, పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడితే శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. భూముల విలువ పెరగడంతో భూ తగాదాల్లో దాడులు పెరుగుతున్నాయని, సివిల్ తగాదాలకు క్రిమినల్ రూపం ఇచ్చి ఫిర్యాదు చేసే అంశాలపై తన గత అనుభవం, ప్రత్యేక న్యాయ సలహాదారుల బృందం (లీగల్ ఒపీనియన్) సహాయంతో పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. నకిలీ భూమి పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించే ముఠాలు, కిరాయి హంతకులు, అంతర్రాష్ట్ర ముఠాలు, ఏటీఎం దొంగతనాలు, ఇళ్లలో పనిచేసే వారి ద్వారా జరిగే నేరాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

దేశంలో ఏటా సుమారు 1,80,000 మంది, తెలంగాణలో దాదాపు 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని పేర్కొంటూ, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ‘గోల్డెన్ అవర్’లో స్పందించి ప్రాణాలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని, ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు జాయింట్ సీపీ (ట్రాఫిక్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న డీసీపీలతో పాటు, అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారి ఇంచార్జ్‌గా నూతనంగా ఏర్పాటైన ‘టీ-మార్స్’ (T-MARS) విభాగం ట్రాఫిక్ నిర్వహణను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. పెండింగ్ ఈ-చలాన్లు ఉన్న వాహనదారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ జరిమానాలు వసూలు చేస్తామని చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల స్నేహపూర్వక పోలీసింగ్ (సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్) అందిస్తూ, గతంలో కమిషనర్లుగా పనిచేసిన శ్రీ సి.వి. ఆనంద్, శ్రీ వి.సి. సజ్జనార్ గార్లు ప్రారంభించిన ప్రజాహిత, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) తరహా ఫోరమ్‌ల ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తామని, డయల్ 112, డయల్ 100 కాల్స్‌కు పెట్రోల్ మొబైల్ వాహనాలు తక్షణమే స్పందించేలా, పోలీస్ స్టేషన్లలో కేసులు వెంటనే నమోదయ్యేలా అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీలు ఎం. శ్రీనివాసులు, ఐపీఎస్ (అడిషనల్ సీపీ, క్రైమ్స్), తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ (అడిషనల్ సీపీ, లా అండ్ ఆర్డర్), జాయింట్ సీపీలు డి. జోయల్ డేవిస్, ఐపీఎస్ (జాయింట్ సీపీ, ట్రాఫిక్), ఎస్.ఎం.విజయ్ కుమార్, ఐపీఎస్ (జాయింట్ సీపీ, స్పెషల్ బ్రాంచ్), ఇతర సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అన్ని జోన్ల డీసీపీలు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఇతర ప్రత్యేక విభాగాల అధికారులతో సమావేశమై ప్రస్తుత సమస్యలను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

Tags:Dr. Mahesh Muralidhar Bhagwat assumed charge as Police Commissioner