March 30, 2026
Explore
మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురిపై కఠిన చర్యలు…

మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురిపై కఠిన చర్యలు…

March 30, 2026 | Andhra Pradesh

శ్రీ సత్యసాయి ముచ్చట్లు:

ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధింపు…

జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల ప్రాణ భద్రత లక్ష్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ వాహనాల తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి న్యాయస్థానంలో హాజరుపరచి జరిమానాలు విధిస్తున్నారు.

ఈ చర్యల్లో భాగంగా హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.ఆదివారం రాత్రి సుమారు 10.00 గంటల సమయంలో, హిందూపురం రూరల్ యూపీఎస్ సీఐ చంద్ర ఆంజనేయులు ,తమ సిబ్బందితో కలిసి తూముకుంట చెక్‌పోస్ట్ వద్ద ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన వారిని ఈ రోజు కోర్టులో హాజరుపరచగా, హిందూపురం ద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ సి.ఎస్. రమాదేవి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.40,000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, మాట్లాడుతూ,“రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే ప్రధాన లక్ష్యం. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని తనిఖీలలో గుర్తించి వారిని న్యాయస్థానంలో హాజరుపరచి జరిమానాలు విధించడం కొనసాగుతుంది” అని తెలిపారు.
అలాగే, ఇటువంటి నిర్లక్ష్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Tags:Strict action against four individuals for driving under the influence of alcohol.