తిరుమలముచ్చట్లు:
పంచమి తీర్థం పడి ఊరేగింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి : జేఈఓ డా. ఎ. శరత్
నవంబరు 20లోపు రథోత్సవ పనులు పూర్తి చేయాలి
తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సంబంధిత విభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రథోత్సవ ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి
అమ్మవారి ఆభరణాలు, వాహనాలు, బంగారు రథం శుభ్రపరిచే పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. రథోత్సవానికి సంబంధించి రథం చెక్క పనులు, పెయింటింగ్, చక్రాల ఫిట్నెస్ తదితర పనులన్నింటినీ నవంబరు 20వ తేదీలోపు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
డిసెంబరు 14న పంచమి తీర్థం – పడి ఊరేగింపునకు ప్రత్యేక ఏర్పాట్లు
పంచమి తీర్థం సందర్భంగా తిరుమల నుంచి ప్రారంభమయ్యే పడి ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జేఈఓ సూచించారు. ఈ ఊరేగింపులో సుమారు 60 కళాబృందాలు పాల్గొననున్న నేపథ్యంలో భక్తులకు విశేష ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభూతిని కలిగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
పడి ఊరేగింపునకు సంబంధించి కోమలమ్మ సత్రం నుంచి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలిపిరి నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయం వరకు రహదారుల మరమ్మతులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో చేపట్టాలన్నారు.
ఊరేగింపు మార్గంలో మామిడి తోరణాలు, అరటి చెట్లు, పందిళ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించేందుకు మార్గమంతా అనౌన్స్మెంట్లు, బ్రాడ్కాస్టింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వాహన సేవలు, ముఖ్య కార్యక్రమాలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జేఈఓ సూచించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
కార్తీక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఇంజినీరింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జేఈఓ సూచించారు.
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించేందుకు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో సీఈ మనోహరం, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మల్లికార్జున ప్రసాద్, వీజీవో గిరిధర, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, గోశాల డైరెక్టర్ డా. శివకుమార్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ డా. కుసుమ కుమారి, అదనపు హెల్త్ ఆఫీసర్ డా. సునీల్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Tags: Elaborate arrangements made for the Kartika Brahmotsavams of Sri Padmavathi Ammavaru in Tirumala