తిరుపతి ముచ్చట్లు:
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాలతో సత్యవేడు పోలీసుల ప్రత్యేక చొరవ – మాదరాపాకం–సత్యవేడు రహదారిపై మరమ్మతు పనులు ప్రారంభం.
- ప్రమాదాలకు ఆస్కారంగా మారిన భారీ గుంతలపై సమాచారం అందిన వెంటనే పోలీసుల స్పందన.
- ముందస్తు ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు.
- WMM మెటీరియల్, భారీ రోలర్‌తో రహదారిని పటిష్టపరిచే పనులు.
- ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పనుల నిర్వహణ.. సత్యవేడు ఎస్ఐ,ఆర్ అండ్ బి శాఖ సమన్వయంతో శాశ్వత పరిష్కారానికి కృషి.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర పరిస్థితులపై సమాచారం అందిన వెంటనే స్పందించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రత అనేది కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడమే కాకుండా, ప్రమాదాలకు దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కారానికి చొరవ తీసుకోవడమని ఎస్పీ సూచించారు.
ఈ ఆదేశాల అమలులో భాగంగా మాదరాపాకం–సత్యవేడు రహదారిపై ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడిన విషయాన్ని సత్యవేడు పోలీసులు గుర్తించారు. ఈ మార్గంలో నిత్యం ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో గుంతలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల వాహనదారులకు ప్రమాద ముప్పు మరింత ఎక్కువగా ఉంది.
అంతేకాకుండా, దెబ్బతిన్న రహదారికి సమీపంలో పాఠశాల ఉండటం, విద్యార్థులు ప్రతిరోజూ ఇదే మార్గంలో రాకపోకలు సాగించడం, సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటం వంటి అంశాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. విద్యార్థుల భద్రతతో పాటు సాధారణ ప్రయాణికుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు సత్యవేడు ఎస్ఐ శ్రీ సాయి నాథ్ చౌదరి ప్రత్యేక చొరవ తీసుకొని తక్షణ చర్యలకు ఉపక్రమించారు.
కేవలం సమస్యను గుర్తించడమే కాదు.. పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చర్యలు: పుత్తూరు ఎస్డీపీఓ రవికుమార్, సీఐ మురళి నాయుడు వారి సూచనల మేరకు, సత్యవేడు ఎస్ఐ శ్రీ సాయి నాథ్ చౌదరి పర్యవేక్షణలో సంబంధిత సిబ్బంది సమన్వయంతో రహదారి మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. కేవలం గుంతలను పూడ్చి చేతులు దులుపుకోకుండా, WMM (Wet Mix Macadam) మెటీరియల్‌ను వినియోగించి భారీ రోలర్ సహాయంతో రహదారిని చదును చేస్తూ పటిష్టపరిచే పనులు చేపట్టారు. వాహనాల రాకపోకలకు వీలైనంత వరకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పనులు నిర్వహిస్తున్నారు. ఈ మరమ్మతు పనులను మరుసటి రోజులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాత్కాలిక మరమ్మతులే కాకుండా.. శాశ్వత పరిష్కారానికి కృషి: రహదారిపై ప్రస్తుత ప్రమాదకర పరిస్థితిని తొలగించడంతో పాటు, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అవసరమని పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి అధికారులతో సమన్వయం చేసుకొని ఈ రహదారిని పూర్తి స్థాయిలో నూతనంగా నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తున్నారు.
ప్రజల భద్రత కోసం పోలీసుల నిరంతర నిబద్ధత: ప్రజల నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని బాధ్యతగా స్వీకరించి, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించడం తిరుపతి జిల్లా పోలీసుల విధి నిర్వహణలో భాగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పోలీసుల సేవలు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ప్రజల దైనందిన జీవనంలో భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారంలోనూ కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నాము.
ప్రజలు తమ పరిసరాల్లో ప్రమాదకర రహదారులు, ట్రాఫిక్ సమస్యలు లేదా ప్రజల భద్రతకు ముప్పు కలిగించే పరిస్థితులను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేయాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Tags:Protecting people’s lives is the top priority—immediate response on a dangerous road.