హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది.
అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 41.8 డిగ్రీలు, జగిత్యాలలో 41.6, మంచిర్యాలలో 41.6, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లిలో 41.5, ములుగు, నిజామాబాద్‌లో 41.4, నల్లగొండలో 41.3 డిగ్రీలుగా నమోదయ్యాయని వెల్లడించింది. మిగతా 11 జిల్లాల్లో 40 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. మరో నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని పేర్కొన్నది.
ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా ఏప్రిల్ 5 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగూడెం, హైదరాబాద్, ములుగు, సూర్యాపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, జనగామలో తేలికపాటి వర్షం కురిసినట్టు తెలిపింది.
Tags: Scorching heat grips the state; temperatures hit 40 degrees in 22 districts.