తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు.
ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని యాగశాలకు వేంచేపు చేసి పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామివారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు మూలవర్లకు, ఉత్సవమూర్తులకు పవిత్ర సమర్పణ చేశారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ హరికృష్ణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ లు ధనశేఖర్, ముని కుమార్, ఇతర అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Tags: Offering of ‘Pavitra’ to Sri Kalyana Venkateswara Swamy held with great grandeur