November 6, 2026
Explore
జడ్పిటిసి, ఎంపిటిసి పోలింగ్ రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలి

జడ్పిటిసి, ఎంపిటిసి పోలింగ్ రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలి

November 6, 2026 | Andhra Pradesh

పీలేరు డివిజన్ ఎనిమిది మండలాల ఎన్నికల సామగ్రి స్వీకరణ ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలి

స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

పీలేరుముచ్చట్లు:

రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం పీలేరు డివిజన్లో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ అనంతరం ఎన్నికల బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి స్వీకరణను, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం సంజయ్ గాంధీ డిగ్రీ కళాశాలలో పీలేరు డివిజన్ కు సంబంధించి ఏర్పాటు చేసిన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల రిసెప్షన్, బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత చర్యలను ఆర్డీవో విజయలక్ష్మితో కలిసి కలెక్టర్ పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో 8 మండలాలలోని మొత్తం 367 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు స్వీకరించేందుకు మండలాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… ఎనిమిది మండలాలకు సంబంధించిన ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్ ల స్వీకరణ ప్రక్రియ సజావుగా ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్స్లను ఉంచి పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు. అలాగే స్ట్రాంగ్ రూములు వద్ద, కౌంటింగ్ రోజు ఎటువంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈనెల 7న కౌంటింగ్ రోజు ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రవేశ మార్గాలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రం పరిసరాల్లో క్రమబద్ధమైన రాకపోకలు ఉండేలా, గందరగోళానికి తావులేకుండా అవసరమైన బారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే ఎన్నికల సమాచారం, ఫలితాలను మీడియా ప్రతినిధులకు సకాలంలో అందించేందుకు ప్రత్యేక మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వివిధ అంశాలలో చర్చించి పలు సూచనలు జారీ చేశారు.

Tags: Robust arrangements must be made at the polling, reception, and counting centers for the ZPTC and MPTC elections.